ఇర్కాన్‌ బోర్లా- లెమన్ ట్రీ ఖుషీ

ఇర్కాన్‌ బోర్లా- లెమన్ ట్రీ ఖుషీ

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) రెండో త్రైమాసికంలో సాధించిన ఫలితాలు నిరాశపరచడంతో రైల్వే రంగ మౌలిక సదుపాయాల దిగ్గజం ఇర్కాన్‌(IRCON) ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ కౌంటర్‌లో అమ్మకాలు ఊపందుకున్నాయి. కాగా.. మరోపక్క ఈ ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్)లో నిర్వహణ లాభం, లాభదాయకత మెరుగుపడటంతో ఆతిథ్య రంగ కంపెనీ లెమన్‌ ట్రీ హోటల్స్‌ లిమిటెడ్‌  కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. వెరసి ఇర్కాన్‌ షేరు నష్టాలతో డీలా పడగా..  లెమన్‌ ట్రీ లాభాలతో సందడి చేస్తోంది. వివరాలు చూద్దాం..

ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో పీఎస్‌యూ సంస్థ ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ నికర లాభం 4 శాతం క్షీణించి రూ. 83 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం మాత్రం 26 శాతం పుంజుకుని రూ. 1237 కోట్లను అధిగమించింది. ఫలితాల నేపథ్యంలో ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 6.5 శాతం పతనమై రూ. 409 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 407 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. 

Image result for lemon tree hotels ltd

లెమన్‌ట్రీ హోటల్స్‌ లిమిటెడ్‌
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో లెమన్‌ట్రీ హోటల్స్‌ లిమిటెడ్‌ రూ. 2.2 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది(2018-19) క్యూ2లో రూ. 5.7 కోట్ల నికర లాభం ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం 19 శాతం పుంజుకుని రూ. 153 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం మరింత అధికంగా 35 శాతం ఎగసి రూ. 48 కోట్లను అధిగమించింది. ఇబిటా మార్జిన్లు 28 శాతం నుంచి 31.7 శాతానికి ఎగశాయి. ఫలితాల నేపథ్యంలో లెమన్‌ట్రీ హోటల్స్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 6 శాతం జంప్‌చేసి రూ. 61 వద్ద ట్రేడవుతోంది.