వీఎస్‌టీ రికార్డ్‌- నాల్కో వీక్‌

వీఎస్‌టీ రికార్డ్‌- నాల్కో వీక్‌

సుప్రసిద్ధ ఇన్వెస్టర్‌ రాధాకృష్ణన్‌ దమానీ కంపెనీలో ఇన్వెస్ట్‌ చేసినట్లు వెల్లడికావడంతో పొగాకు ఉత్పత్తుల దిగ్గజం వీఎస్‌టీ ఇండస్ట్రీస్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించడం దీనికి జత కలిసినట్లు నిపుణులు చెబుతున్నారు. కాగా.. మరోపక్క ఈ ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్)లో నిరుత్సాహకర పనితీరు ప్రదర్శించడంతో మెటల్‌ రంగ పీఎస్‌యూ నేషనల్‌ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్‌(నాల్కో) కౌంటర్‌లో అమ్మకాలు తలెత్తాయి. వెరసి ఒడిదొడుకుల మార్కెట్లోనూ వీఎస్‌టీ భారీ లాభాలతో కళకళలాడుతుంటే.. నాల్కో నష్టాలతో డీలాపడింది. వివరాలు చూద్దాం..

వీఎస్‌టీ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌
డీమార్ట్‌ స్టోర్ల అధినేత రాధాకృష్ణన్‌ దమానీ 2.7 లక్షల షేర్లను సొంతం చేసుకున్నట్లు వెల్లడికావడంతో వీఎస్‌టీ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. షేరుకి రూ. 4260 ధరలో వీటిని కొనుగోలు చేసినట్లు బీఎస్‌ఈ డేటా పేర్కొంది. దీంతో ఈ షేరు తొలుత ఎన్‌ఎస్ఈలో 8 శాతంపైగా దూసుకెళ్లి రూ. 4622ను అధిగమించింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 7 శాతం జంప్‌చేసి రూ. 4575 వద్ద ట్రేడవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో వీఎస్‌టీ ఇండస్ట్రీస్‌ నికర లాభం 33 శాతం ఎగసి రూ. 76 కోట్లను అధిగమించింది. నిర్వహణ లాభం 12 శాతం పెరిగి రూ. 99 కోట్ల కు చేరింది. ఫలితాల నేపథ్యంలో గత రెండు రోజుల్లోనూ ఈ షేరు 10 శాతం ర్యాలీ చేయడం గమనార్హం!

Image result for NALCO ltd

నాల్కో లిమిటెడ్‌
కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో నాల్కో లిమిటెడ్‌ రూ. 28 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది(2018-19) క్యూ2లో రూ. 510 కోట్ల నికర లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 22 శాతం క్షీణించి రూ. 2,363 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో నాల్కో షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 3.2 శాతం నీరసించి రూ. 42 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 41 వరకూ వెనకడుగు వేసింది.