టెలికం షేర్లకు డాట్‌ షాక్‌

టెలికం షేర్లకు డాట్‌ షాక్‌

ఉన్నట్టుండి టెలికం రంగ కౌంటర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. మూడు నెలల్లోగా ఆదాయ వాటా(రెవెన్యూ షేర్‌) బకాయిలనును జమ చేయవలసిందిగా టెలికం సర్వీసుల కంపెనీలకు టెలికం శాఖ(DOT) నోటీసులు జారీ చేసినట్లు వెలువడిన వార్తలు ప్రభావం చూపుతున్నట్లు మార్కెట్‌ విశ్లేషకులు పేర్కొంటున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలమేరకు డాట్‌ తాజాగా నోటీసులను జారీ చేసినట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. డాట్‌ అంచనాల ప్రకారం భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా, బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌ వేల కోట్లలో బకాయిపడినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో పలు టెలికం రంగ కౌంటర్లు అమ్మకాలతో బేర్‌మంటున్నాయి. అయితే పీఎస్‌యూ కంపెనీ ఎంటీఎన్‌ఎల్ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగి 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకడం గమనార్హం! వివరాలు చూద్దాం..

కుప్పకూలిన ఐడియా 
టెలికం కంపెనీలు స్థూల ఆదాయం నుంచి సర్దుబాటు చేసిన లైసెన్స్‌ ఫీజును డాట్‌కు చెల్లించవలసి ఉంటుందని పరిశ్రమ వర్గాలు తెలియజేశాయి. అయితే ప్రభుత్వం లైసెన్స్‌ ఫీజులో కోత, రెండేళ్లపాటు చెల్లింపుల నిలిపివేత వంటి ప్రణాళికల ద్వారా టెలికం రంగానికి ఉపశమనాన్ని కల్పించే యోచనలో ఉన్నట్లు చెబుతున్నాయి. కాగా.. తాజా వార్తల నేపథ్యంలో మొబైల్‌ రంగ కంపెనీ వొడాఫోన్‌ ఐడియా షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో దాదాపు 18 శాతం కుప్పకూలింది. రూ. 3 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 2.85 వద్ద సరికొత్త కనిష్టాన్ని తాకింది. ఈ బాటలో భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ 8 శాతం పతనమైంది. రూ. 201 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 199 దిగువకు చేరింది. ఇక మొబైల్‌ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ 3.5 శాతం క్షీణించి రూ. 356 వద్ద ట్రేడవుతోంది. అయితే ఎంటీఎన్‌ఎల్‌ 5 శాతం జంప్‌చేసి రూ. 11.70 వద్ద ఫ్రీజ్‌కావడం విశేషం!