కన్సాలిడేషన్‌లో.. ఐటీ ప్లస్‌

కన్సాలిడేషన్‌లో.. ఐటీ ప్లస్‌

మిశ్రమ ప్రపంచ సంకేతాల నడుమ దేశీ స్టాక్‌ మార్కెట్లు ఒడిదొడుకులతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 40 పాయింట్ల వెనకడుగుతో 40,076కు చేరగా.. నిఫ్టీ 23 పాయింట్ల క్షీణతతో 11,817 వద్ద ట్రేడవుతోంది. దేశ ఔట్‌లుక్‌ను మూడీస్‌ ఇన్వెస్టర్‌ సర్వీసెస్‌ స్థిరత్వం నుంచి ప్రతికూలానికి సవరించడంతో వారాంతాన ఒక్కసారిగా నీరసించిన మార్కెట్లు తదుపరి కన్సాలిడేషన్‌ బాటలో సాగుతున్న సంగతి తెలిసిందే. కాగా.. మీడియా రంగ దిగ్గజం డిస్నీ అండతో  అమెరికా స్టాక్‌ మార్కెట్లలో డోజోన్స్‌ ఇండెక్స్‌ సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. అయితే ప్రస్తుతం ఆసియా మార్కెట్లు అమ్మకాలతో కుదేలయ్యాయి. 

మీడియా అప్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంక్స్‌, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ 1.4-0.5 శాతం మధ్య బలహీనపడగా.. ఐటీ, మీడియా 0.3 శాతం చొప్పున పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇన్ఫోసిస్‌, టైటన్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఐషర్‌, యస్‌ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, మారుతీ 1.2-0.4 శాతం మధ్య బలపడ్డాయి. అయితే ఇన్‌ఫ్రాటెల్‌ 6.4 శాతం పతనంకాగా.. ఎయిర్‌టెల్‌, ఇండస్‌ఇండ్‌, అల్ట్రాటెక్‌, టాటా మోటార్స్‌, బ్రిటానియా, హిందాల్కో, గ్రాసిమ్‌, ఐవోసీ, టాటా స్టీల్‌ 2.7-1.2 శాతం మధ్య డీలాపడ్డాయి.   

ఐడియా పతనం
డెరివేటివ్‌ కౌంటర్లలో ముత్తూట్‌ ఫైనాన్స్ 6 శాతం జంప్‌చేయగా.. బాటా ఇండియా, జూబిలెంట్‌ ఫుడ్‌, అపోలో హాస్పిటల్స్‌, సన్‌ టీవీ, మహానగర్ గ్యాస్‌, పెట్రోనెట్‌, బెర్జర్‌ పెయింట్స్‌ 4-1.5 శాతం మధ్య ఎగశాయి. కాగా.. మరోవైపు ఐడియా 16 శాతం కుప్పకూలగా.. అరబిందో, అదానీ పవర్‌, డిష్‌ టీవీ, నాల్కో, ఈక్విటాస్‌, ఐబీ హౌసింగ్‌, మారికో 9-3 శాతం మధ్య పతనమయ్యాయి. 

మిడ్‌ క్యాప్స్‌ డౌన్‌ 
మార్కెట్లు హెచ్చుతగ్గుల మధ్య కన్సాలిడేషన్‌ బాటలో సాగుతున్న నేపథ్యంలో మధ్య,చిన్నతరహా కౌంటర్లలోనూ అమ్మకాలు కనిపిస్తున్నాయి. బీఎస్‌ఈలో మిడ్‌ క్యాప్‌ 0.4 శాతం, స్మాల్‌ క్యాప్స్‌ 0.1 శాతం చొప్పున నీరసించాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 588 లాభపడగా.. 733 నష్టాలతో ట్రేడవుతున్నాయి.