డిస్నీ పుష్‌- డోజోన్స్‌ రికార్డ్‌

డిస్నీ పుష్‌- డోజోన్స్‌ రికార్డ్‌

రెండు రోజులుగా జోరు చూపుతున్న మీడియా రంగ దిగ్గజం డిస్నీ కౌంటర్‌కు మరోసారి భారీ డిమాండ్‌ పుట్టడంతో డోజోన్స్‌ ఇండెక్స్‌ జోరందుకుంది. వెరసి బుధవారం 92 పాయింట్లు(0.3 శాతం) ఎగసి 27,739 వద్ద ముగిసింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. డిస్నీ షేరు 7.4 శాతం జంప్‌చేసింది. తాజా త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించడానికితోడు, డిస్నీప్లస్‌ పేరుతో స్ట్రీమింగ్‌ సర్వీసులను ప్రారంభించడంతో ఈ కౌంటర్‌ దూకుడు చూపుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. మంగళవారం నుంచీ ప్రారంభమైన స్ట్రీమింగ్‌ సర్వీసులకు తొలి దశలోనే 10 మిలియన్ల మంది నుంచి స్పందన లభించడం ప్రభావం చూపినట్లు తెలియజేశారు. కాగా.. మరోవైపు ఎస్‌అండ్‌పీ 2 పాయింట్లు(0.1 శాతం) పుంజుకుని 3094 వద్ద నిలవగా, నాస్‌డాక్‌ 4 పాయింట్లు నీరసించి 8,482 వద్ద స్థిరపడింది. 

యథాతథ పాలసీ?
కాంగ్రెషనల్‌ జాయింట్ ఎకనమిక్‌ కమిటీ ముందు ప్రసంగించిన ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌ జెరోమీ పావెల్‌ ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తున్నంత కాలం వడ్డీ రేట్లలో మార్పులు చేపట్టే అవసరం ఉండకపోవచ్చంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం అనుసరిస్తున్న పరపతి విధానాలు పరిస్థితులకు అనుగుణంగా ఉన్నాయని చెప్పారు. అయితే ద్రవ్బోల్బణం, విదేశీ బలహీనతలు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టిపెట్టవలసి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు.

నేలచూపుతో
బుధవారం యూరోపియన్‌ స్టాక్‌ మార్కెట్లలో జర్మనీ, యూకే, ఫ్రాన్స్‌ 0.4-0.2 శాతం మధ్య నీరసించాయి. ప్రస్తుతం ఆసియాలోనూ అమ్మకాలదే పైచేయిగా నిలుస్తోంది.  ఇండొనేసియా, హాంకాంగ్‌, సింగపూర్‌, తైవాన్, జపాన్‌, చైనా 0.7-0.15 శాతం మధ్య డీలాపడగా.. థాయ్‌లాండ్‌, కొరియా నామమాత్ర లాభాలతో  ట్రేడవుతున్నాయి.