ఫ్లాట్‌ ఓపెనింగ్‌ నేడు?!

ఫ్లాట్‌ ఓపెనింగ్‌ నేడు?!

దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు అక్కడక్కడే అన్నట్లుగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ప్రస్తుతం సింగపూర్(ఎస్‌జీఎక్స్) నిఫ్టీ 14 పాయింట్లు బలపడి 11,879 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్ల ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. బుధవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు మరోసారి ఫ్లాట్‌గా ముగిశాయి. అయితే డోజోన్స్‌ సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. కాగా.. ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో అమ్మకాలదే పైచేయిగా నిలుస్తోంది. కాగా.. దేశీయంగా మంగళవారం ఒడిదొడుకుల మధ్య కదిలిన మార్కెట్లు చివరికి నష్టాలతో ముగిశాయి. అక్టోబర్‌లో ద్రవ్యోల్బణం 16 నెలల గరిష్టానికి చేరిన నేపథ్యంలో నేడు మార్కెట్లు హెచ్చుతగ్గుల మధ్య కదిలే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

చివర్లో పతనం 
బుధవారం ఒడిదొడుకుల మధ్య ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరికి పతనంతో ముగిశాయి. ప్రపంచ సంకేతాలు బలహీనంగా ఉన్న నేపథ్యంలో రోజంతా హెచ్చుతగ్గుల మధ్య కదిలాయి. చివరికి సెన్సెక్స్‌ 229 పాయింట్లు క్షీణించి 40,116 వద్ద నిలవగా.. నిఫ్టీ 73 పాయింట్లు కోల్పోయి 11,840 వద్ద స్థిరపడింది. దేశ ఔట్‌లుక్‌ను మూడీస్‌ ఇన్వెస్టర్‌ సర్వీసెస్‌ స్థిరత్వం నుంచి ప్రతికూలానికి సవరించడంతో వారాంతాన ఒక్కసారిగా నీరసించిన మార్కెట్లు తదుపరి కన్సాలిడేషన్‌ బాటలో సాగుతున్న సంగతి తెలిసిందే. 

ఎఫ్‌పీఐల జోరు
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 585 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 890 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. మంగళవారం మార్కెట్లకు సెలవుకాగా.. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 664 కోట్లను ఇన్వెస్ట్‌చేయగా.. డీఐఐలు రూ. 245 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించిన సంగతి తెలిసిందే.