చివరికి అన్ని రంగాలూ పతనం 

చివరికి అన్ని రంగాలూ పతనం 

ఒడిదొడుకుల మధ్య ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరికి పతనంతో ముగిశాయి. ప్రపంచ సంకేతాలు బలహీనంగా ఉన్న నేపథ్యంలో రోజంతా హెచ్చుతగ్గుల మధ్య కదిలాయి. చివరికి సెన్సెక్స్‌ 229 పాయింట్లు క్షీణించి 40,116 వద్ద నిలవగా.. నిఫ్టీ 73 పాయింట్లు కోల్పోయి 11,840 వద్ద స్థిరపడింది. దేశ ఔట్‌లుక్‌ను మూడీస్‌ ఇన్వెస్టర్‌ సర్వీసెస్‌ స్థిరత్వం నుంచి ప్రతికూలానికి సవరించడంతో వారాంతాన ఒక్కసారిగా నీరసించిన మార్కెట్లు తదుపరి కన్సాలిడేషన్‌ బాటలో సాగుతున్న సంగతి తెలిసిందే. కాగా.. అమెరికా స్టాక్‌ మార్కెట్లు(మంగళవారం) ఫ్లాట్‌గా ముగియగా.. నేటి ట్రేడింగ్‌లో ఆసియా మార్కెట్లలో అమ్మకాలదే పైచేయిగా నిలిచింది. 

మీడియా, బ్యాంక్స్‌, మెటల్‌
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ అమ్మకాలతో నీరసించాయి. ప్రధానంగా మీడియా, పీఎస్‌యూ బ్యాంక్స్‌, మెటల్‌, రియల్టీ 4.5-2.2 శాతం మధ్య వెనకడుగు వేశాయి. నిఫ్టీ దిగ్గజాలలో బ్రిటానియా 5 శాతం జంప్‌చేయగా.. టీసీఎస్‌, ఆర్‌ఐఎల్‌, నెస్లే, బజాజ్‌ ఫిన్‌, హెచ్‌యూఎల్‌ 3.7-0.5 శాతం మధ్య బలపడ్డాయి. అయితే యస్‌ బ్యాంక్‌, గెయిల్‌, జీ, అదానీ పోర్ట్స్‌, గ్రాసిమ్‌, ఎస్‌బీఐ, హిందాల్కో, వేదాంతా, యాక్సిస్‌, ఇండస్‌ఇండ్‌ 6-2.5 శాతం మధ్య డీలాపడ్డాయి.   

సన్‌ టీవీ డౌన్‌
డెరివేటివ్‌ కౌంటర్లలో మహానగర్‌ గ్యాస్‌, టీవీఎస్‌ మోటార్‌, వోల్టాస్‌, అమర రాజా, అశోక్‌ లేలాండ్‌, పిరమల్‌, కమిన్స్‌ 4-1.2 శాతం మధ్య ఎగశాయి. కాగా.. మరోవైపు సన్‌టీవీ, డిష్‌టీవీ, ఐబీ హౌసింగ్‌, ఐడియా, జస్ట్‌ డయల్‌, అదానీ ఎంటర్‌, జిందాల్ స్టీల్‌, అదానీ పవర్‌, గ్లెన్‌మార్క్‌, నిట్‌ టెక్‌ 11-6 శాతం మధ్య పతనమయ్యాయి. 

చిన్న షేర్లు వీక్‌
హెచ్చుతగ్గుల మధ్య మార్కెట్లు చివరికి పతనంకావడంతో మధ్య,చిన్నతరహా కౌంటర్లలోనూ అమ్మకాలు ఊపందుకున్నాయి. బీఎస్‌ఈలో మిడ్‌ క్యాప్‌ 0.8 శాతం, స్మాల్‌ క్యాప్స్‌ 1.2 శాతం చొప్పున నీరసించాయి. ట్రేడైన షేర్లలో 966 లాభపడగా.. 1606 నష్టాలతో ముగిశాయి. 

ఎఫ్‌పీఐల అండ
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 664 కోట్లను ఇన్వెస్ట్‌చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 245 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. కాగా.. వారాంతాన ఎఫ్‌పీఐలు రూ. 932 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 584 కోట్లకుపైగా విలువైన స్టాక్స్‌ విక్రయించిన సంగతి తెలిసిందే.