రుపీ.. పతనం!

రుపీ.. పతనం!

వరుసగా మూడో రోజు డాలరుతో మారకంలో బలహీనంగా ప్రారంభమైన దేశీ కరెన్సీ పతన బాట పట్టింది. ప్రస్తుతం ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో 50 పైసలు కోల్పోయి 71.97 వద్ద ట్రేడవుతోంది. వెరసి సాంకేతికంగా కీలకమైన 72 సమీపానికి చేరింది. వాణిజ్య వివాదాలకు సంబంధించి అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌.. చైనాపై ప్రతికూల వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో తొలుత రూపాయి 28 పైసలు తక్కువగా 71.75 వద్ద ప్రారంభమైంది. తద్వారా సెప్టెంబర్‌ 17 తదుపరి రూపాయి కనిష్టానికి చేరింది. తదుపరి దిగుమతిదారులు, తదితర సంస్థల నుంచి డాలర్లకు డిమాండ్‌ పెరగడంతో రూపాయి మరింత నీరసించినట్లు ఫారెక్స్‌ వర్గాలు పేర్కొన్నాయి. 

రెండు రోజులుగా
గురునానక్‌ జయంతి సందర్భంగా మంగళవారం ఫారెక్స్‌ మార్కెట్లకు సెలవుకాగా.. సోమవారం డాలరుతో మారకంలో రూపాయి 19 పైసల నష్టంతో 71.47 వద్ద ముగిసింది. ఇది నెల రోజుల కనిష్టంకాగా.. అమెరికా, చైనా మధ్య ఒప్పందంపై సందేహాలు, హాంకాంగ్‌లో చెలరేగిన అల్లర్లు ప్రభావం చూపినట్లు ఫారెక్స్ వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. వారాంతన(8న) రూపాయి మరింత అధికంగా 31 పైసలు కోల్పోయి 71.28 వద్ద స్థిరపడిన సంగతి తెలిసిందే. దేశ ఔట్‌లుక్‌ను విదేశీ రేటింగ్‌ దిగ్గజం మూడీస్‌ ఇన్వెస్టర్‌ సర్వీసెస్‌ స్థిరత్వం నుంచి ప్రతికూలానికి సవరించడంతో దేశీ కరెన్సీ బలహీనపడినట్లు ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు.