మార్కెట్లకు పొంచి ఉన్న జీడీపీ గండం...!

మార్కెట్లకు పొంచి ఉన్న జీడీపీ గండం...!

ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో దేశీయ రెండు ప్రముఖ బ్యాంకులు 5శాతం గ్రోత్ మందగమనాన్ని చవి చూశాయి. ఈ సెప్టెంబర్‌లో పారిశ్రామిక ఉత్పత్తి కూడా ఊహించిన దానికంటే పదునైన సంకోచాన్ని నమోదు చేసింది. ఈ ఆర్ధిక సంవత్సరం (FY 19) లో జీడీపీ 6.8శాతంగా నమోదైంది. జూలై-సెప్టెంబర్ మాసాల మధ్య కాలంలో జీడీపీ వృద్ధి రేటు తొలి త్రైమాసికంలో 5శాతం ఉంటే..అది ఇప్పుడు 4.2శాతం పడిపోయింది. సెటిమెంట్ , డిమాండ్ల పునరుద్ధరణకై మరిన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి కూడా పెరగుతూ వస్తుంది. కాగా దేశంలోని జీడీపీ రెండో త్రైమాసిక సమాచారం నవంబర్ 29న విడుదల కానుంది, పూర్తి సంవత్సర అంచనా జనవరిలో వెల్లడవుతుంది. 
ఈ ఆర్ధిక సంవత్సరం రెండో క్వార్టర్ జీడీపీ గ్రోత్ రేట్ సుమారు 4.2శాతం గా ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం దేశంలోని ఆటో రంగంలో అమ్మకాలు పూర్తిగా క్షీణించడమే. ఇదే కాకుండా ఎయిర్ ట్రాఫిక్ నిబంధనలు, కోర్ సెక్టార్‌లో మాంద్యం, ఇన్ఫ్రా సెక్టార్‌లో పెట్టుబడుల తగ్గుదల వంటివి జీడీపీ గ్రోత్ రేటు తగ్గుదలనే సూచిస్తున్నాయని ఎకనామిక్ రీసెర్చ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా పేర్కొంది. జీడీపీ గ్రోత్ రేటు 6.1 శాతం నుండి 5శాతానికి పరిమితం కావొచ్చని ఎస్బీఐ రిపోర్ట్ పేర్కొంది. ఆర్బీఐ మంత్లీ పాలసీ రివ్యూ ప్రకారం వడ్డీ రేట్ల కోత కూడా జీడీపీపై ప్రభావం చూపనుందని ఎస్బీఐ వాఖ్యానించింది.  గత జూన్ క్వార్టర్‌కు ఎకానమీ గ్రోత్ రేట్ 5శాతంగా మాత్రమే ఉండటం గత 6 సంవత్సరాలతో పోలిస్తే చాలా నెమ్మదించినట్టే లెక్క అని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. సెప్టెంబర్ లో ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ 4.3శాతంగా ఉంది. అక్టోబర్ 2011 నుండి చూస్తే..ఇది అత్యంత చెత్త ప్రదర్శనగా చెప్పుకోవచ్చు. సెప్టెంబర్ నుండి గత 6నెలల కాలంలో ఇండస్ట్రియల్ గ్రోత్ కేవలం 1.3శాతం మాత్రమే పెరిగింది. గత సంవత్సరం ఇదే కాలానికి ఇది 5.2శాతంగా ఉండటం గమనార్హం. ఇప్పటికే కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ ఆర్ధిక వ్యవస్థ పలు ఒడుదిడుకులను ఎదుర్కొంటుందని ప్రకటించారు. సత్వర చర్యలు ఉంటాయని, జీడీపీ గ్రోత్ రేటును స్థిరీకరించడానికి యత్నాలు చేస్తామని ఆమె పేర్కొన్నారు. కోటక్ మహీంద్ర బ్యాంక్ లెక్కల ప్రకారం రెండో త్రైమాసికంలో జీడీపీ గ్రోత్ 4.7శాతం గానూ, పూర్తి సంవత్సర జీడీపీ గ్రోత్ 5శాతంగానూ ఉండొచ్చని అంచనా వేస్తోంది.  2020 ఆర్ధిక సంవత్సరం తొలి క్వార్టర్‌లో వినిమయ రంగం, పెట్టుబడుల రంగం నెమ్మదించిదని,ఈ ప్రభావం రెండో క్వార్టర్‌లోనూ ఉండవచ్చని కోటక్ మహీంద్రా భావిస్తుంది. 

GDP infograph
రియల్ ఎస్టేట్ రంగం, ఫైనాన్షియల్ రంగాల్లో వృద్ధి తక్కువగా నమోదు కావడంతో జీడీపీపై ప్రభావం ఉంటుందని క్రిసిల్ సంస్థ అభిప్రాయపడుతోంది. జులై - సెప్టెంబర్ మధ్య కాలంలో జీడీపీ గ్రోత్ రేట్ 5శాతంగా ఉండొచ్చని క్రిసిల్ పేర్కొంది. అక్టోబర్‌లో విద్యుత్‌ డిమాండ్ 13శాతానికి పడిపోవడం, డీజిల్ వినియోగం కుదించబడటం, పండుగ సీజన్ ఉన్నప్పటికీ కార్ల అమ్మకాలు నవంబర్‌లో సానుకూలంగా లేకపోవడం వంటి కారణాలు జీడీపీ గ్రోత్ రేటు నెమ్మదించడానికి దోహదపడుతున్నాయి. 
కాగా రానున్న ఆరు నెలలు జీడీపీ వృద్ధి రేటుకు సానుకూలంగా ఉండొచ్చని HDFC బ్యాంక్ అభిప్రాయపడుతుంది. ఈ సంవత్సరం రెండో అర్ధ భాగంలో ఆటో మోబైల్ రంగం కునారిల్లుతున్నప్పటికీ, FMCG, ఫార్మా, కెమికల్స్ రంగాలు మంచి పనితీరునే కనబరుస్తున్నాయని, వీటి కార్పోరేట్ ఫలితాలు మెరుగ్గా ఉండొచ్చని HDFC బ్యాంక్ పేర్కొంది. HDFC బ్యాంక్ అంచనాల ప్రకారం రెండో త్రైమాసికంలో గ్రోత్ రేట్ 4.8శాతం-5.8 శాతంగా ఉండొచ్చు. కేర్ రేటింగ్ సంస్థ అంచనాల మేరకు గ్రోత్ రేటు రెండో క్వార్టర్‌లో 4.5శాతంగానూ,  పూర్తి సంవత్సరానికి 6.2శాతంగా ఉండొచ్చు. 
ప్రస్తుత సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ పాలసీ రేట్లలో 135 బేసిస్ పాయింట్లను తగ్గించింది. గత పాలసీ సమీక్షలో ఆర్బీఐ ఈ సంవత్సర వృద్ధి అంచనాను 6.1శాతానికి తగ్గించింది. జూలై- సెప్టెంబర్ క్వార్టర్‌లో జీడీపీలో 5.3 శాతం పెరుగుదల ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. ఏది ఏమైనా ఆర్బీఐ ప్రకటించిన లార్జర్ రేట్‌ కట్ పాలసీ వల్ల ఆర్ధిక వ్యవస్థ, బ్యాంకింగ్ రంగాల్లో అస్థిరతకు కారణమైందని ఎస్బీఐ అభిప్రాయపడుతోంది. 
కాగా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు కొన్ని ఉద్దీపన చర్యలను ఇప్పటికే ప్రారంభించింది. కార్పోరేట్ పన్నును 15శాతానికి తగ్గించడం, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల కోసం రూ. 25,000 కోట్లతో ప్రత్యేక విండోను ఆవిష్కరించడం వంటి చర్యలు జీడీపీ గ్రోత్ కు మద్దతుగా నిలుస్తాయని ఎకానమిస్టులు భావిస్తున్నారు.