బాప్‌రే.. AU స్మాల్- MSTC లి. 

బాప్‌రే.. AU స్మాల్- MSTC లి. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ప్రయివేట్‌ రంగ సంస్థ AU స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ కౌంటర్‌ జోరు కొనసాగుతోంది. కాగా.. చత్తీస్‌గఢ్‌ ప్రభుత్వానికి విక్రయ సేవలందించేందుకు ఎంపిక కావడంతో పీఎస్‌యూ కంపెనీ ఎంఎస్‌టీసీ(MSTC) లిమిటెడ్‌ కౌంటర్‌కు సైతం డిమాండ్‌ కొనసాగుతోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ఈ రెండు కౌంటర్లూ మరోసారి భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. అంతేకాకుండా సరికొత్త గరిష్టాలను సైతం అందుకున్నాయి. వివరాలు చూద్దాం..

AU స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌
గత రెండు రోజుల్లో 14 శాతం ర్యాలీ చేసిన ప్రయివేట్‌ రంగ సంస్థ AU స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ మరోసారి జోరందుకుంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 11 శాతంపైగా దూసుకెళ్లి రూ. 800 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 807 వరకూ ఎగసింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. ఈ ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో బ్యాంక్‌ నిర్వహణ లాభం 55 శాతం జంప్‌చేసి రూ. 217 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం 41 శాతం పెరిగి రూ. 452 కోట్లను తాకింది. స్థూల మొండిబకాయిలు 2.1 శాతం నుంచి 2 శాతానికి వెనకడుగు వేశాయి. నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) 38 శాతం పుంజుకుని రూ. 27,876 కోట్లకు చేరగా.. డిపాజిట్లు 72 శాతం అధికంగా రూ. 22149 కోట్లయ్యాయి. పటిష్ట ఫలితాల కారణంగా ఈ కౌంటర్‌కు డిమాండ్‌ కొనసాగుతున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. 

ఎంఎస్‌టీసీ లిమిటెడ్‌
గత 12 ట్రేడింగ్‌ సెషన్లుగా ర్యాలీ బాటలో సాగుతున్న ప్రభుత్వ రంగ కంపెనీ ఎంఎస్‌టీసీ లిమిటెడ్‌కు తాజాగా డిమాండ్‌ కనిపిస్తోంది. చత్తీస్‌గడ్‌ ప్రభుత్వం సెల్లింగ్‌ ఏజెంట్‌గా నియమించుకున్నట్లు వెల్లడించడం దీనికి కారణంకాగా.. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 17 శాతం దూసుకెళ్లింది. రూ. 180 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 185 వరకూ ఎగసింది. తద్వారా ఈ ఏడాది మార్చిలో స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యాక ఎంఎస్‌టీసీ షేరు సరికొత్త గరిష్టాన్ని ఆందుకుంది. గత 12 రోజుల్లో ఈ  షేరు 91 శాతం లాభపడటం విశేషం! ఇప్పటికే ఈ ఆక్షన్‌ సేవల కోసం ఎల్‌అండ్‌టీకి సెల్లింగ్‌ ఏజెంట్‌గా ఎంపికకాగా.. గత వారం బర్న్‌ స్టాండర్డ్‌ కంపెనీతోనూ అవగాహనా ఒప్పందాన్ని(ఎంవోయూ) కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ సేవల ప్రభుత్వ రంగ కంపెనీ షేరు ఇటీవల వెలుగులో నిలుస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.