వినతీ- నాట్కో.. Q2 దెబ్బ!

వినతీ- నాట్కో.. Q2 దెబ్బ!

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) రెండో త్రైమాసికంలో సాధించిన ఫలితాలు అంచనాలను చేరకపోవడంతో ఫార్మా రంగ సంస్థ వినతీ ఆర్గానిక్స్‌ లిమిటెడ్‌ కౌంటర్‌కు అమ్మకాల ఒత్తిడి ఎదురవుతోంది. కాగా.. మరోపక్క ఈ ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో హెల్త్‌కేర్‌ రంగ సంస్థ నాట్కో ఫార్మా లిమిటెడ్‌ కౌంటర్‌లోనూ అమ్మకాలు తలెత్తాయి. ఇన్వెస్టర్లు ఈ షేర్లను విక్రయించడానికి ఆసక్తి చూపడంతో ఈ రెండు కౌంటర్లూ నష్టాలతో కళతప్పాయి. వివరాలు చూద్దాం..

వినతీ ఆర్గానిక్స్‌ లిమిటెడ్‌
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో వినతీ ఆర్గానిక్స్‌ లిమిటెడ్‌ నికర లాభం 33 శాతం ఎగసి రూ. 110 కోట్లకు చేరింది. అయితే మొత్తం ఆదాయం 15 శాతం క్షీణించి రూ. 256 కోట్లను తాకింది. నిర్వహణ లాభం సైతం 16 శాతం వెనకడుగుతో రూ. 111 కోట్లకు పరిమితమైంది. ఇబిటా మార్జిన్లు 43.5 శాతం నుంచి 43.3 శాతానికి స్వల్పంగా నీరసించాయి. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో వినతీ ఆర్గానిక్స్‌ షేరు దాదాపు 6 శాతం పతనమై రూ. 1954 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 1950 వరకూ జారింది. 

నాట్కో ఫార్మా లిమిటెడ్‌
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో నాట్కో ఫార్మా లిమిటెడ్‌ నికర లాభం 35 శాతం  క్షీణించి రూ. 118 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం 11 శాతం వెనకడుగుతో రూ. 519 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం 36 శాతం తక్కువగా రూ. 167.5 కోట్లను తాకింది. ఇబిటా మార్జిన్లు 44.6 శాతం నుంచి 32 శాతానికి బలహీనపడ్డాయి. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో నాట్కో ఫార్మా షేరు 3 శాతం నష్టంతో రూ. 561 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 553 వరకూ పతనమైంది.