వహ్‌ తాజ్‌- హింద్‌ రెక్టిఫయర్స్‌ 

వహ్‌ తాజ్‌- హింద్‌ రెక్టిఫయర్స్‌ 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో తాజ్‌ బ్రాండ్‌ లగ్జరీ హోటళ్ల సంస్థ ఇండియన్‌ హోటల్స్‌ కంపెనీ లిమిటెడ్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. కాగా.. మరోపక్క ఈ ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్‌) ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించడంతో విద్యుత్‌ రంగ సెమీకండక్టర్ల తయారీ కంపెనీ హిందుస్తాన్‌ రెక్టిఫయర్స్‌ లిమిటెడ్‌ కౌంటర్‌కు డిమాండ్‌ కొనసాగుతోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో హెచ్చుతగ్గుల మార్కెట్లోనూ ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

ఇండియన్‌ హోటల్స్‌ లిమిటెడ్‌
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఇండియన్‌ హోటల్స్‌ కంపెనీ లిమిటెడ్‌ టర్న్‌అరౌండ్ ఫలితాలు సాధించింది. క్యూ2లో రూ. 71 నికర లాభం ఆర్జించింది. గతేడాది(2018-19) క్యూ2లో రూ. 5 కోట్ల నికర నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం 5 శాతం పుంజుకుని రూ. 1695 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం సైతం 57 శాతం జంప్‌చేసి రూ. 182 కోట్లను తాకింది. ఇబిటా మార్జిన్లు 5.9 శాతం ఎగసి 17.7 శాతానికి చేరాయి. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఇండియన్‌ హోటల్స్‌ షేరు 5.5 శాతం జంప్‌చేసి రూ. 155 వద్ద ట్రేడవుతోంది. 

Image result for hind rectifiers ltd

హింద్‌ రెక్టిఫయర్స్‌ లిమిటెడ్‌
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో హింద్‌ రెక్టిఫయర్స్‌ లిమిటెడ్‌ నికర లాభం మూడు రెట్లు ఎగసి రూ. 7.5 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం 40 శాతం పెరిగి రూ. 83 కోట్లను తాకింది. నిర్వహణ లాభం రెట్టింపై రూ. 13 కోట్లను అధిగమించింది. ఫలితాల నేపథ్యంలో తొలుత ఎన్‌ఎస్‌ఈలో హింద్‌ రెక్టిఫయర్స్‌ షేరు 16 శాతం దూసుకెళ్లింది. రూ. 219 వద్ద సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. ప్రస్తుతం 12 శాతం జంప్‌చేసి రూ. 211 వద్ద ట్రేడవుతోంది. గత మూడు నెలల్లో ఈ కౌంటర్‌ 68 శాతం ర్యాలీ చేయడం విశేషం!