అనిల్‍‌ను ఆదుకోవడానికి వచ్చిన ఎయిర్‌టెల్, తప్పుకున్న ముఖేష్ అంబానీ!

అనిల్‍‌ను ఆదుకోవడానికి వచ్చిన ఎయిర్‌టెల్, తప్పుకున్న ముఖేష్ అంబానీ!

అనిల్ అంబానీకి చెందిన, దివాల ప్రక్రియలో ఉన్న రిలయన్స్ కమ్యునికేషన్ ఆస్తుల వేలం కోసం సుమారు 6 కంపెనీలు బిడ్లను దాఖలు చేశాయి. ఆసక్తి కర విషయమేంటంటే.. ఈ బిడ్లకు రిలయన్స్ జియో దూరంగా ఉండటం. మరో ముఖ్యమైన అంశం... అనిల్ ఆస్తుల వేలం పాటలో  జియో ప్రత్యర్ధి భారతీ ఎయిర్ టెల్ బిడ్లను దాఖలు చేయడం. భారతీ ఎయిర్ టెల్, భారతీ ఇన్‌ఫ్రా టెల్, ప్రైవేట్ ఈక్విటీ సంస్థ వార్దే పార్ట్‌నర్స్ తో సహా మొత్తం 6 సంస్థలు రిలయన్స్ కమ్యునికేషన్స్ ఆస్తుల వేలం పాటలో బిడ్లను దాఖలు చేశాయి. కాగా ఈ బిడ్ల సమర్పణకు ఆఖరి తేదీ నవంబర్ 11 గా ఉండగా, జియో మరో 10 రోజుల గడువును కోరింది. కానీ నేషనల్ లా ట్రిబ్యునల్ ఇందుకు తిరస్కరించింది. దీంతో ఈ వేలం పాట నుండి ముఖేష్‌ అంబానీకి చెందిన జియో తప్పుకుంది. ఆర్‌ కామ్‌కు రుణాలిచ్చిన రుణదాతల కమిటీ ఈ బిడ్లను నవంబర్ 13న తెరవనుంది. కాగా ఆర్‌ కామ్‌కు చెందిన ఆస్తులను దక్కించుకోవడం కోసం గత సంవత్సరం జియో తో సహా మెత్తం 12 సంస్థలు ఆసక్తి చూపాయి. ఈ స్పెక్ట్రమ్‌ కోసం బిడ్‌ దాఖలు చేసిన మాట వాస్తవమేనని, ఇది విలువైన ఆస్తిగా పరిగణిస్తున్నామని భారతీ ఎయిర్ టెల్ పేర్కొంది. కాగా ప్రస్తుతం ఈ సంస్థలు వేలం కోసం దరఖాస్తు చేసిన ఆస్తుల విలువ రూ. 46,000 కోట్లుగా ఉన్నాయి. ఆర్‌కామ్ ఆస్తుల్లో దేశంలోని 22 టెలికాం సర్కిల్స్‌లోని 14 వ సర్కిల్‌లోని స్ప్రెక్టమ్, రిలయన్స్ ఇన్‌ఫ్రా టెల్ కింద ఉన్న దాదాపు 43,000 టెలికాం టవర్లు, ఫైబర్ నెట్‌వర్క్స్ , మరి కొన్ని రియల్ ఎస్టేట్ ఆస్తులు అమ్మకానికి ఉన్నాయి. కాగా ఇప్పటికే రిలయన్స్ కమ్యునికేషన్స్ కు ఉన్న రుణ భారం మొత్తం రూ. 90,000 కోట్లుగా ఉంది. 
కాగా ఇవే ఆస్తులను గతంలో రిలయన్స్ జియో కొనుగోలు చేయడానికి యత్నించింది. కానీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికాం రెగ్యులేటరీ వారు చెప్పిన అభ్యంతరాలతో ముఖేష్ అంబానీ వెనక్కి తగ్గారు. వీటిలో పలు వైర్‌లెస్ ఆస్తులు, బ్యాండ్ విడ్త్ ఆస్తులు వంటివి ఉన్నాయి. బ్యాండ్‌ విడ్త్ చెల్లింపులు ఎవరు చేస్తారన్న దానిమీద స్పష్టత లేక పోవడంతో ఈ డీల్ విఫలమైంది. దీంతో అనిల్ అంబానీకి ఇచ్చిన రుణదాతలు నేషనల్ లా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించడంతో దివాల ప్రక్రియలో భాగంగా ఇప్పుడు ఆస్తుల వేలంపాటను నిర్వహిస్తున్నారు. ఇవి కాకుండా ఇప్పటికే రిలయన్స్ కమ్యునికేషన్స్ రూ. 3,000 కోట్ల విలువైన ఆప్టిక్ ఫైబర్ ఆస్తులను, రూ. 2,000 కోట్ల విలువైన  మీడియా కన్వర్జెన్స్ నోడ్స్ ఆస్తులను రిలయన్స్ జియోకు విక్రయించింది.