రుపీ- 2 నెలల కనిష్టం

రుపీ- 2 నెలల కనిష్టం

డాలరుతో మారకంలో వరుసగా మూడో రోజు దేశీ కరెన్సీ బలహీనపడింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో 28 పైసలు తక్కువగా 71.75 వద్ద ప్రారంభమైంది. వెరసి సెప్టెంబర్‌ 17 తదుపరి రూపాయి కనిష్టానికి చేరింది. ప్రస్తుతం 20 పైసలు నీరసించి 71.67 వద్ద ట్రేడవుతోంది. గురునానక్‌ జయంతి సందర్భంగా మంగళవారం ఫారెక్స్‌ మార్కెట్లకు సెలవుకాగా.. సోమవారం డాలరుతో మారకంలో రూపాయి 19 పైసల నష్టంతో 71.47 వద్ద ముగిసింది. ఇది నెల రోజుల కనిష్టంకాగా.. వాణిజ్య వివాదాలకు సంబంధించి అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌.. చైనాపై ప్రతికూల వ్యాఖ్యలు చేయడం, హాంకాంగ్‌లో చెలరేగిన అల్లర్లు ప్రభావం చూపినట్లు ఫారెక్స్ వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. వారాంతన(8న) రూపాయి మరింత అధికంగా 31 పైసలు కోల్పోయి 71.28 వద్ద స్థిరపడిన సంగతి తెలిసిందే. దేశ ఔట్‌లుక్‌ను విదేశీ రేటింగ్‌ దిగ్గజం మూడీస్‌ ఇన్వెస్టర్‌ సర్వీసెస్‌ స్థిరత్వం నుంచి ప్రతికూలానికి సవరించడంతో దేశీ కరెన్సీ బలహీనపడినట్లు ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు.