కన్సాలిడేషన్‌లో.. మీడియా వీక్‌

కన్సాలిడేషన్‌లో.. మీడియా వీక్‌

ప్రపంచ సంకేతాలు బలహీనంగా ఉన్న నేపథ్యంలో ఒడిదొడుకుల మధ్య ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభనష్టాల మధ్య కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 3 పాయింట్లు క్షీణించి 40,342కు చేరగా.. నిఫ్టీ 2 పాయింట్ల నామమాత్ర లాభంతో 11,916 వద్ద ట్రేడవుతోంది. దేశ ఔట్‌లుక్‌ను మూడీస్‌ ఇన్వెస్టర్‌ సర్వీసెస్‌ స్థిరత్వం నుంచి ప్రతికూలానికి సవరించడంతో వారాంతాన ఒక్కసారిగా నీరసించిన మార్కెట్లు తదుపరి కన్సాలిడేషన్‌ బాటలో సాగుతున్న సంగతి తెలిసిందే. కాగా.. మంగళవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. అయితే ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో అమ్మకాలదే పైచేయిగా నిలుస్తోంది. 

మెటల్స్‌ ఓకే
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా మీడియా 2.5 శాతం క్షీణించగా, ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌ 0.3 శాతం చొప్పున బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో బ్రిటానియా 4.4 శాతం జంప్‌చేయగా.. యస్‌ బ్యాంక్‌, టీసీఎస్‌, ఆర్‌ఐఎల్‌, నెస్లే, కోల్‌ ఇండియా, ఐషర్, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, టైటన్‌ 2.2-0.6 శాతం మధ్య పుంజుకున్నాయి. అయితే గెయిల్‌, ఇన్ఫోసిస్‌, హిందాల్కో, ఎస్‌బీఐ, ఇండస్‌ఇండ్‌, ఎయిర్‌టెల్‌, ఐవోసీ, బజాజ్‌ ఫైనాన్స్‌, ఐసీఐసీఐ 2-0.5 శాతం మధ్య డీలాపడ్డాయి.   

సెంచురీ అప్‌
డెరివేటివ్‌ కౌంటర్లలో సెంచురీ టెక్స్‌ 6 శాతం జంప్‌చేయగా.. ఎన్‌ఎండీసీ, అరబిందో, కమిన్స్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ ప్రు, బెర్జర్‌ పెయింట్స్‌ 3-1.5 శాతం మధ్య ఎగశాయి. కాగా.. మరోవైపు జస్ట్‌ డయల్‌, అదానీ ఎంటర్‌, నిట్‌ టెక్‌, దివీస్‌ లేబ్‌, నాల్కో, గ్లెన్‌మార్క్‌ 5.5-1.4 శాతం మధ్య క్షీణించాయి. 

చిన్న షేర్లు అటూఇటూ 
మార్కెట్లు హెచ్చుతగ్గుల మధ్య కన్సాలిడేషన్‌ బాటలో సాగుతున్న నేపథ్యంలో మధ్య,చిన్నతరహా కౌంటర్లలోనూ మిశ్రమ ట్రెండ్‌ కనిపిస్తోంది. బీఎస్‌ఈలో మిడ్‌ క్యాప్‌ 0.2 శాతం పుంజుకోగా, స్మాల్‌ క్యాప్స్‌ 0.2 శాతం నీరసించాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 885 లాభపడగా.. 714 నష్టాలతో ట్రేడవుతున్నాయి. మీడియా కౌంటర్లలో సన్‌ టీవీ, డిష్‌ టీవీ, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఐనాక్స్‌ లీజర్‌, రేడియో సిటీ, టీవీ టుడే, పీవీఆర్‌ 7-1 శాతం మధ్య పతనమయ్యాయి.