చివరికి ఫ్లాట్‌- బ్యాంక్స్‌ అండ

చివరికి ఫ్లాట్‌- బ్యాంక్స్‌ అండ

నేలచూపుతో ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు తదుపరి హెచ్చుతగ్గుల మధ్య నీరసంగా కదిలాయి. చివరికి అక్కడక్కడే అన్నట్లుగా ముగిశాయి. సెన్సెక్స్‌ 21 పాయింట్లు బలపడి 40,345 వద్ద నిలవగా.. నిఫ్టీ 5 పాయింట్లు పుంజుకుని 11,913 వద్ద స్థిరపడింది. మూడీస్‌ ఇన్వెస్టర్‌ సర్వీసెస్‌ దేశ ఔట్‌లుక్‌ను స్థిరత్వం నుంచి ప్రతికూలానికి సవరించడంతో వారాంతాన ఒక్కసారిగా అమ్మకాలు ఊపందుకున్న సంగతి తెలిసిందే. దీంతో ట్రేడర్లు మరోసారి అప్రమత్తంగా వ్యవహరించినట్లు నిపుణులు చెబుతున్నారు. కాగా.. వాణిజ్య వివాద పరిష్కార ఒప్పందంపై అంచనాలతో శుక్రవారం మరోసారి అమెరికా స్టాక్‌ మార్కెట్లు సరికొత్త గరిష్టం వద్ద ముగియగా.. ఆసియా మార్కెట్లలో అమ్మకాలదే పైచేయిగా నిలిచింది. 

మీడియా జూమ్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా మీడియా 3 శాతం జంప్‌చేయగా.. బ్యాంక్‌ నిఫ్టీ 1.3 శాతం, రియల్టీ 0.7 శాతం చొప్పున లాభపడ్డాయి. అయితే ఐటీ, ఎఫ్‌ఎంసీజీ 0.5 శాతం స్థాయిలో బలహీనపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో యస్‌ బ్యాంక్‌ 6 శాతం జంప్‌చేయగా.. బీపీసీఎల్‌, గెయిల్‌, టాటా మోటార్స్‌, ఐసీఐసీఐ, ఇండస్‌ఇండ్‌, ఇన్‌ఫ్రాటెల్‌, బజాజ్‌ ఫిన్‌, కొటక్‌ బ్యాంక్‌ 3-1.2 శాతం మధ్య పుంజుకున్నాయి. అయితే నెస్లే, హీరో మోటో, హిందాల్కో, వేదాంతా, సిప్లా, ఐషర్, గ్రాసిమ్‌, టీసీఎస్‌, ఆర్‌ఐఎల్‌, ఏషియన్‌ పెయింట్స్‌ 2.3-1.2 శాతం మధ్య డీలాపడ్డాయి.   

అమర రాజా జోరు
డెరివేటివ్‌ కౌంటర్లలో అమరరాజా 10 శాతం దూసుకెళ్లగా.. ఆర్‌బీఎల్ బ్యాంక్‌, ఐడియా, జిందాల్‌ స్టీల్‌, భెల్‌, టొరంట్‌ పవర్‌, అశోక్‌ లేలాండ్‌ 6.5-3.5 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు ఈక్విటాస్‌ 6.5 శాతం పతనంకాగా.. టాటా పవర్‌, ఇండిగో, మ్యాక్స్‌ ఫైనాన్స్‌, బాలకృష్ణ, పిడిలైట్‌, ఎంఆర్‌ఎఫ్‌, అదానీ పవర్‌ 4-2.2 శాతం మధ్య క్షీణించాయి.

చిన్న షేర్లు ఓకే 
మార్కెట్లు హెచ్చుతగ్గుల మధ్య కన్సాలిడేషన్‌ బాటలో ముగిసిన నేపథ్యంలో మధ్య,చిన్నతరహా కౌంటర్లకు ఓమాదిరి డిమాండ్‌ కనిపించింది. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.3 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1251 లాభపడగా.. 1292 నష్టాలతో  నిలిచాయి. మీడియా కౌంటర్లలో డిష్‌ టీవీ, జీ, జీ మీడియా, సన్‌ టీవీ, టీవీ టుడే, పీవీఆర్‌ 9.5-1 శాతం మధ్య ఎగశాయి.

ఎఫ్‌పీఐల దన్ను
నగదు విభాగంలో వారాంతాన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 932 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 584 కోట్లకుపైగా విలువైన స్టాక్స్‌ విక్రయించాయి. ఇక గురువారం ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 927 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. డీఐఐలు దాదాపు రూ. 636 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే.