నెస్కో -ఆస్ట్రాజెనెకా.. జూమ్‌

నెస్కో -ఆస్ట్రాజెనెకా.. జూమ్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో డైవర్సిఫైడ్‌ ఇంజినీరింగ్‌ కంపెనీ నెస్కో లిమిటెడ్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. కాగా.. మరోపక్క ఈ ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో పటిష్ట ఫలితాలు సాధించడంతో హెల్త్‌కేర్‌ రంగ దిగ్గజం ఆస్ట్రాజెనెకా ఫార్మా ఇండియా లిమిటెడ్‌ కౌంటర్‌ సైతం వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ఒడిదొడుకుల మార్కెట్లోనూ ఈ రెండు కౌంటర్లూ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

నెస్కో లిమిటెడ్‌
ఈ ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో నెస్కో లిమిటెడ్‌ నికర లాభం 50 శాతం ఎగసి రూ. 74 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం సైతం 21 శాతం పుంజుకుని రూ. 135 కోట్లను తాకింది. నిర్వహణ లాభం 23 శాతం పెరిగి రూ. 86 కోట్లయ్యింది. ఇబిటా మార్జిన్లు 65.9 శాతం నుంచి 67.4 శాతానికి బలపడ్డాయి. పన్ను వ్యయాలు రూ. 17 కోట్ల నుంచి రూ. 12 కోట్లకు తగ్గాయి. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో నెస్కో లిమిటెడ్‌ షేరు 8 శాతం జంప్‌చేసి రూ. 608 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 616 వరకూ ఎగసింది. తద్వారా 52 వారాల గరిష్టాన్ని తాకింది.

ఆస్ట్రాజెనెకా ఫార్మా ఇండియా
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో ఆస్ట్రాజెనెకా ఫార్మా ఇండియా లిమిటెడ్‌ నికర లాభం 58 శాతం ఎగసి రూ. 14 కోట్లను అధిగమించింది. మొత్తం ఆదాయం సైతం 29 శాతం పుంజుకుని రూ. 208 కోట్లను తాకింది. నిర్వహణ లాభం 2 రెట్లు పెరిగి రూ. 34 కోట్లకు చేరింది. ఇబిటా మార్జిన్లు 9.2 శాతం నుంచి 16.1 శాతానికి బలపడ్డాయి. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఆస్ట్రాజెనెకా ఫార్మా ఇండియా షేరు 3 శాతం లాభపడి రూ. 2567 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 2689 వరకూ ఎగసింది.