ఈ బ్లూచిప్‌ షేర్లకు కొనుగోళ్ల కిక్‌

ఈ బ్లూచిప్‌ షేర్లకు కొనుగోళ్ల కిక్‌

ఇటీవల కొద్ది రోజులుగా ర్యాలీ బాటలో సాగుతున్న ప్రయివేట్‌ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ అసెట్ మేనేజ్‌మెంట్‌ కంపెనీ(ఏఎంసీ) కౌంటర్‌కు మరోసారి డిమాండ్‌ పుట్టింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ షేరు సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. కాగా.. మరోపక్క ఐదేళ్ల కనిష్టాన్ని తాకాక టర్న్‌అరౌండ్‌ బాట పట్టిన ప్రయివేట్‌ రంగ సంస్థ యస్‌ బ్యాంక్‌ కౌంటర్ సైతం వెలుగులో నిలుస్తోంది. తొలి సెషన్‌లో బ్లాక్‌డీల్‌ ద్వారా నేటి ట్రేడింగ్‌లో 10 లక్షల షేర్లు చేతులు మారిన నేపథ్యంలో యస్‌ బ్యాంక్‌ షేరు సైతం లాభాలతో కళకళలాడుతోంది. ఇతర వివరాలు చూద్దాం..

హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ
గత మూడు రోజులుగా జోరు చూపుతున్న హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ మరోసారి దూకుడు చూపుతోంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 4.4 శాతం జంప్‌చేసి రూ. 3330 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 3350 వరకూ ఎగసింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. కంపెనీ 2018 ఆగస్ట్‌ 6న రూ. 1100 ధరలో ఐపీవోకు వచ్చింది. వెరసి 205 శాతం దూసుకెళ్లింది. విదేశీ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థలు పెట్టుబడులకు పరిగణించే ఎంఎస్‌సీఐ ఇండెక్స్‌లో ఈ నెల 26 నుంచి ఈ కౌంటర్‌కు చోటు లభించనుండటం, ఈ ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో పటిష్ట ఫలితాలు ప్రకటించడం వంటి అంశాలు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. 

యస్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌
ఈ నెలలో సుప్రసిద్ధ ఇన్వెస్టర్‌ రాకేష్ జున్‌జున్‌వాలా 0.5 శాతం వాటాను సొంతం చేసుకున్నట్లు వార్తలు వెలువడ్డాక జోరందుకున్న యస్‌ బ్యాంక్‌ కౌంటర్‌ తాజాగా బ్లాక్‌డీల్‌ నేపథ్యంలో జోరందుకుంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 72.5 వద్ద ట్రేడవుతోంది. అక్టోబర్‌లో బ్యాంక్‌ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ వాటాను విక్రయించాక కొత్త యాజమాన్యం తాజా పెట్టుబడుల సమీకరణ ప్రయత్నాలు చేపట్టింది. ఇందుకు విదేశీ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ 1.2 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నట్లు బ్యాంక్‌ సీఈవో రవ్‌నీత్‌ గిల్‌ తెలియజేశారు. కాగా.. ఈ ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో నికర నష్టం ప్రకటించడంతోపాటు.. మొండి బకాయిలు సైతం పెరిగాయి. అయితే కొత్తగా పెట్టుబడులను సమీకరించడం ద్వారా బ్యాంకు కార్యకలాపాలను వేగవంతం చేయడం, ఎన్‌పీఏలను కట్టడి చేయడం వంటి చర్యలు చేపట్టనున్నట్లు యాజమాన్యం చెబుతోంది. ఇటీవల ఈ కౌంటర్‌ ఐదేళ్ల కనిష్టం నుంచి 50 శాతం ర్యాలీ చేసినప్పటికీ.. ఏడాదికాలాన్ని పరిగణిస్తే ఇప్పటికీ 63 శాతం పతనంకావడం గమనించదగ్గ అంశమని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.