ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) రెండో త్రైమాసికంలో రివర్స్ టర్న్అరౌండ్ ఫలితాలు ప్రకటించడంతో ఫార్మా రంగ దిగ్గజం నోవర్తిస్ ఇండియా లిమిటెడ్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. కాగా.. మరోపక్క ఈ ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్)లో సాధించిన ఫలితాలు అంచనాలను అందుకోవడంతో ఆటోవిడిభాగాల దిగ్గజం మదర్సన్ సుమీ సిస్టమ్స్ లిమిటెడ్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. వెరసి నోవర్తిస్ షేరు నష్టాలతో కళ తప్పగా.. మదర్సన్ సుమీ షేరు లాభాలతో సందడి చేస్తోంది. వివరాలు చూద్దాం..
నోవర్తిస్ ఇండియా లిమిటెడ్
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై-సెప్టెంబర్)లో నోవర్తిస్ ఇండియా లిమిటెడ్ రూ. 5.2 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది(2018-19) క్యూ2లో రూ. 9.4 కోట్ల నికర లాభం ఆర్జించింది. కాగా.. మొత్తం ఆదాయం మాత్రం 10 శాతం పుంజుకుని రూ. 118 కోట్లను తాకింది. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం బీఎస్ఈలో నోవర్తిస్ ఇండియా షేరు దాదాపు 4 శాతం పతనమై రూ. 660 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 655 వరకూ క్షీణించింది.
మదర్సన్ సుమీ సిస్టమ్స్
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై-సెప్టెంబర్)లో మదర్సన్ సుమీ సిస్టమ్స్ లిమిటెడ్ నికర లాభం 8 శాతం నీరసించి రూ. 458 కోట్లను తాకింది. అయితే మొత్తం ఆదాయం 6 శాతం పుంజుకుని రూ. 15,709 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం 5 శాతం పెరిగి రూ. 1105 కోట్లను అధిగమించింది. ఇబిటా మార్జిన్లు యథాతథంగా 7 శాతం వద్దే నిలిచాయి. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో మదర్సన్ సుమీ షేరు దాదాపు 4 శాతం జంప్‌చేసి రూ. 134 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 135 వరకూ ఎగసింది.