అఫ్లే ఇండియా భళా- జేకే డౌన్‌

అఫ్లే ఇండియా భళా- జేకే డౌన్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో మొబైల్‌ మార్కెటింగ్‌ కంపెనీ అఫ్లే ఇండియా లిమిటెడ్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. కాగా.. మరోపక్క ఈ ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో పటిష్ట ఫలితాలు సాధించినప్పటికీ.. అంచనాలను అందుకోకపోవడంతో ప్రయివేట్‌ రంగ సంస్థ జేకే సిమెంట్‌ లిమిటెడ్‌ కౌంటర్‌లో అమ్మకాలు తలెత్తాయి. అయితే ఇటీవల ర్యాలీ బాటలో సాగిన ఈ కౌంటర్లో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడం ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. వెరసి ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో హెచ్చుతగ్గుల మార్కెట్లోనూ అఫ్లే ఇండియా  షేరు లాభాలతో సందడి చేస్తుంటే.. జేకే సిమెంట్‌ ఇండియా షేరు నష్టాలతో డీలాపడింది. వివరాలు చూద్దాం..

అఫ్లే ఇండియా లిమిటెడ్‌
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో అఫ్లే ఇండియా లిమిటెడ్‌ నికర లాభం 51 శాతం ఎగసి రూ. 16 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం సైతం 40 శాతం పుంజుకుని రూ. 85 కోట్లను తాకింది. నిర్వహణ లాభం సైతం 47 శాతం జంప్‌చేసి రూ. 19 కోట్లకు చేరింది. ఇబిటా మార్జిన్లు 22.3 శాతం నుంచి 21.2 శాతానికి స్వల్పంగా బలహీనపడ్డాయి. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో అఫ్లే ఇండియా షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 1465 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 1530 వరకూ ఎగసింది. తద్వారా 52 వారాల గరిష్టాన్ని తాకింది.

Image result for jk cement ltd

జేకే సిమెంట్‌ లిమిటెడ్‌
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో జేకే సిమెంట్‌ లిమిటెడ్‌ నికర లాభం 68 శాతం ఎగసి రూ. 109 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం సైతం 14 శాతం పుంజుకుని రూ. 1254 కోట్లను అధిగమించింది. నిర్వహణ లాభం 50 శాతం అధికంగా రూ. 254 కోట్లకు చేరింది. ఇబిటా మార్జిన్లు 15.4 శాతం నుంచి 20.3 శాతానికి బలపడ్డాయి. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో జేకే సిమెంట్‌ షేరు 2.2 శాతం క్షీణించి రూ. 1158 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 1125 వద్ద కనిష్టానికి చేరింది.