నారాయణ జోరు- అక్జో నోబెల్‌ డీలా

నారాయణ జోరు- అక్జో నోబెల్‌ డీలా

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో హెల్త్‌కేర్‌ రంగ సంస్థ నారాయణ హృదయాలయ లిమిటెడ్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. కాగా.. మరోపక్క ఈ ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో  పటిష్ట ఫలితాలు సాధించినప్పటికీ.. అంచనాలను అందుకోకపోవడంతో పెయింట్స్‌ తయారీ గ్లోబల్‌ దిగ్గజం అక్జో నోబెల్‌ ఇండియా లిమిటెడ్‌ కౌంటర్‌లో అమ్మకాలు ఊపందుకున్నాయి. అయితే ఇటీవల ర్యాలీ బాటలో సాగిన అక్జో నోబెల్‌ కౌంటర్లో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడం ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. వెరసిఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో హెచ్చుతగ్గుల మార్కెట్లోనూ నారాయణ హృదయాలయ షేరు లాభాలతో సందడి చేస్తుంటే.. అక్జో నోబెల్‌ ఇండియా షేరు నష్టాలతో కళతప్పింది. వివరాలు చూద్దాం..

నారాయణ హృదయాలయ లిమిటెడ్‌
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో నారాయణ హృదయాలయ లిమిటెడ్‌ నికర లాభం మూడు రెట్లు ఎగసి రూ. 45 కోట్లను అధిగమించింది. మొత్తం ఆదాయం సైతం 16 శాతం పుంజుకుని రూ. 822 కోట్లను తాకింది. నిర్వహణ లాభం సైతం 67 శాతం జంప్‌చేసి రూ. 122 కోట్లకు చేరింది. ఇబిటా మార్జిన్లు 10.3 శాతం నుంచి 14.8 శాతానికి బలపడ్డాయి. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో నారాయణ హృదయాలయ షేరు దాదాపు 9 శాతం దూసుకెళ్లి రూ. 299 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 306 వరకూ ఎగసింది. తద్వారా 52 వారాల గరిష్టాన్ని తాకింది.

అక్జో నోబెల్‌ ఇండియా లిమిటెడ్‌
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో అక్జో నోబెల్‌ ఇండియా లిమిటెడ్‌ నికర లాభం 34 శాతం ఎగసి రూ. 49 కోట్లను అధిగమించింది. మొత్తం ఆదాయం మాత్రం 11 శాతం క్షీణించి రూ. 634 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం 12 శాతం పుంజుకుని రూ. 73 కోట్లకు చేరింది. ఇబిటా మార్జిన్లు 9 శాతం నుంచి 11.5 శాతానికి బలపడ్డాయి. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో అక్జో నోబెల్‌ ఇండియా షేరు 7.5 శాతం పతనమై రూ. 1992 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 1970 వద్ద కనిష్టానికి చేరింది.