టీమ్‌లీజ్- ఈక్విటాస్‌.. Q2 దెబ్బ

టీమ్‌లీజ్- ఈక్విటాస్‌.. Q2 దెబ్బ

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) రెండో త్రైమాసికంలో ప్రకటించిన ఫలితాలు  నిరాశపరచడంతో ప్రయివేట్‌ రంగ సంస్థ టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ కౌంటర్‌లో అమ్మకాలు ఊపందుకున్నాయి. కాగా.. మరోపక్క ఈ ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో  సాధించిన ఫలితాలు అంచనాలను చేరకపోవడంతో  స్మాల్‌ ఫైనాన్స్ బ్యాంక్‌ ఈక్విటాస్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ కౌంటర్‌లోనూ అమ్మకాలు తలెత్తాయి. వెరసి హెచ్చుతగ్గుల మార్కెట్లో ఈ రెండు షేర్లూ నష్టాలతో కళతప్పాయి. వివరాలు చూద్దాం..

టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో స్టాఫింగ్‌, రిక్రూట్‌మెంట్‌ కంపెనీ టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ నికర లాభం 19 శాతం నీరసించి రూ. 20 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం మాత్రం 16 శాతం పుంజుకుని రూ. 1268 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం నామమాత్ర వృద్ధితో రూ. 25 కోట్లను తాకింది. ఇబిటా మార్జిన్లు 2.2 శాతం నుంచి 1.9 శాతానికి బలహీనపడ్డాయి. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌  షేరు 6 శాతం పతనమై రూ. 2627 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 2600 వరకూ క్షీణించింది. 

Image result for equitas holdings

ఈక్విటాస్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో ఈక్విటాస్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ నికర లాభం 20 శాతం క్షీణించి రూ. 41 కోట్లకు పరిమితమైంది. నికర వడ్డీ ఆదాయం 27 శాతం పుంజుకుని రూ. 378 కోట్లను తాకింది. అడ్వాన్సులు 33 శాతం పెరిగి రూ.  13,269 కోట్లకు చేరాయి. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈక్విటాస్‌ హోల్డింగ్స్‌ షేరు 4 శాతం పతనమై రూ. 94 దిగువన ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 88 వరకూ క్షీణించింది. తద్వారా 52 వారాల కనిష్టాన్ని తాకింది.