కన్సాలిడేషన్‌ బాటలో.. ఫార్మా డౌన్‌

కన్సాలిడేషన్‌ బాటలో.. ఫార్మా డౌన్‌

బలహీన సెంటిమెంట్‌ కారణంగా నేలచూపుతో ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు హెచ్చుతగ్గుల మధ్య కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 42 పాయింట్లు క్షీణించి 40,281కు చేరగా.. నిఫ్టీ 6 పాయింట్లు నీరసించి 11,902 వద్ద ట్రేడవుతోంది. మూడీస్‌ ఇన్వస్టర్‌ సర్వీసెస్‌ దేశ ఔట్‌లుక్‌ను స్థిరత్వం నుంచి ప్రతికూలానికి సవరించడంతో వారాంతాన ఒక్కసారిగా అమ్మకాలు ఊపందుకున్న సంగతి తెలిసిందే. కాగా.. వాణిజ్య వివాద పరిష్కార ఒప్పందంపై అంచనాలతో శుక్రవారం మరోసారి అమెరికా స్టాక్‌ మార్కెట్లు సరికొత్త గరిష్టం వద్ద ముగిశాయి. అయితే ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో అమ్మకాలదే పైచేయిగా నిలుస్తోంది. 

ప్రభుత్వ బ్యాంక్స్‌ ప్లస్
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా ఫార్మా 1.3 శాతం బలహీనపడగా.. ఐటీ, ఆటో 0.5 శాతం చొప్పున నీరసించాయి. పీఎస్‌యూ బ్యాంక్స్‌ 0.3 శాతం పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో యస్‌ బ్యాంక్‌ 4 శాతం జంప్‌చేయగా.. జీ, ఎయిర్‌టెల్‌, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్‌, టాటా మోటార్స్‌, బ్రిటానియా, ఎంఅండ్ఎం, అల్ట్రాటెక్, బజాజ్‌ ఫైనాన్స్‌ 1.2-0.5 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే సన్‌ ఫార్మా, సిప్లా, కోల్‌ ఇండియా, గ్రాసిమ్‌, నెస్లే, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్‌ఫ్రాటెల్‌, ఎల్‌అండ్‌టీ, ఏషియన్‌ పెయింట్స్‌, ఐషర్‌ 3-0.7 శాతం మధ్య డీలాపడ్డాయి.   

ఈక్విటాస్‌ పతనం
డెరివేటివ్‌ కౌంటర్లలో ఐడియా, అమరరాజా, బీవోబీ, ఐబీ హౌసింగ్‌, జిందాల్‌ స్టీల్‌, ఆర్‌బీఎల్ బ్యాంక్‌, ఎక్సైడ్‌, ఎస్‌ఆర్‌ఎఫ్‌, జస్ట్‌ డయల్ 5.4-1.3 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు ఈక్విటాస్‌ 9 శాతం పతనంకాగా.. టాటా పవర్‌, అశోక్‌ లేలాండ్, ఇండిగో, బాలకృష్ణ, ఆయిల్‌ ఇండియా, టీబీఎస్‌ మోటార్‌, ఎన్‌బీసీసీ 2.5-1.2 శాతం మధ్య క్షీణించాయి.

చిన్న షేర్లు ఓకే 
మార్కెట్లు హెచ్చుతగ్గుల మధ్య కన్సాలిడేషన్‌ బాటలో సాగుతున్నప్పటికీ మధ్య,చిన్నతరహా కౌంటర్లకు ఓమాదిరి డిమాండ్‌ కనిపిస్తోంది. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.35 శాతం చొప్పున బలపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 766 లాభపడగా.. 465 నష్టాలతో ట్రేడవుతున్నాయి. స్మాల్‌ క్యాప్స్‌లో కైటెక్స్‌, కోస్టల్‌ కార్ప్‌, యూనిప్లై, సలసర్‌, ఎస్‌సీఐ, కిల్టిచ్‌, సీమెక్‌, మేఘమణి, అసోసియెటెడ్‌, టీజీవీఎస్‌ఎల్, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా తదితరాలు 18-5 శాతం మధ్య జంప్‌చేశాయి.