ఓపెనింగ్‌లో నేడు నేలచూపు?!

ఓపెనింగ్‌లో నేడు నేలచూపు?!

దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు ప్రతికూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ప్రస్తుతం సింగపూర్(ఎస్‌జీఎక్స్) నిఫ్టీ 34 పాయింట్లు క్షీణించి 11,913 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్ల ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. కాగా.. వరుసగా రెండో రోజు శుక్రవారం(9న) అమెరికా స్టాక్‌ మార్కెట్లు సరికొత్త గరిష్టాల వద్ద ముగిశాయి. అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాద పరిష్కార ఒప్పందంపై అంచనాలు ఇన్వెస్టర్లకు జోష్‌నిచ్చినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇక దేశీయంగా మూడు రోజులపాటు ర్యాలీ చేసిన మార్కెట్లలో వారాంతాన ఒక్కసారిగా అమ్మకాలు ఊపందుకున్నాయి. మూడీస్‌ ఇన్వెస్టర్‌ సర్వీసెస్‌ దేశ ఔట్‌లుక్‌ను స్థిరత్వం నుంచి ప్రతికూలానికి సవరించడంతో సెంటిమెంటు బలహీనపడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. 

చివర్లో పతనం
దేశీ స్టాక్‌ మార్కెట్ల మూడు రోజుల ర్యాలీకి శుక్రవారం బ్రేక్‌ పడింది. ఉన్నట్టుండి ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఎగబడటంతో మార్కెట్లు చివర్లో పతనబాట పట్టాయి. ట్రేడింగ్ ముగిసేరికి సెన్సెక్స్‌ 330 పాయింట్లు కోల్పోయి 40,324 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 104 పాయింట్లు క్షీణించి 11,908 వద్ద స్థిరపడింది. మూడు రోజులుగా మార్కెట్లు ర్యాలీ చేయడంతో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. 

ఎఫ్‌పీఐల అండ
నగదు విభాగంలో వారాంతాన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 932 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 584 కోట్లకుపైగా విలువైన స్టాక్స్‌ విక్రయించాయి. ఇక గురువారం ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 927 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. డీఐఐలు దాదాపు రూ. 636 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. 

ఆసియా వీక్‌
వారాంతాన యూరోపియన్‌ మార్కెట్లు 0.5 శాతం స్థాయిలో వెనకడుగు వేయగా.. ఆసియాలోనూ ప్రస్తుతం అమ్మకాలదే పైచేయిగా నిలుస్తోంది. హాంకాంగ్‌ 2.3 శాతం పతనంకాగా.. చైనా, తైవాన్, కొరియా, సింగపూర్‌, థాయ్‌లాండ్‌, జపాన్‌, ఇండొనేసియా 1.1-0.2 శాతం మధ్య క్షీణించాయి.