గత వారం చిన్న షేర్లు డీలా

గత వారం చిన్న షేర్లు డీలా

యథాప్రకారం గత వారం ఒడిదొడుకుల మధ్య దేశీ స్టాక్‌ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాద పరిష్కార సంకేతాల కారణంగా దేశీ స్టాక్‌ మార్కెట్లు జోరందుకున్నప్పటికీ చివర్లో మూడీస్‌ ఇన్వెస్టర్ సర్వీసెస్‌ దేశ ఔట్‌లుక్‌ను స్థిరత్వం నుంచి నెగిటివ్‌కు సవరించడంతో సెంటిమెంటు బలహీనపడింది. వెరసి గత వారం సెన్సెక్స్‌ నికరంగా 159 పాయింట్లు(0.4 శాతం) బలపడి 40,324 వద్ద నిలవగా.. నిఫ్టీ 18 పాయింట్ల స్వల్ప లాభంతో 11,908 వద్ద స్థిరపడింది. వారం చివర్లో నిఫ్టీ 12,000 స్థాయిని అధిగమించినప్పటికీ ఆ స్థాయిలో నిలవలేకపోయింది!

మిడ్‌ క్యాప్స్‌ వీక్‌
గత వారం మధ్య, చిన్నతరహా కౌంటర్లలో అమ్మకాలదే పైచేయిగా నిలిచింది. దీంతో బీఎస్‌ఈలో మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 1.1 శాతం క్షీణించి 14,731 వద్ద ముగిసింది. ఇక స్మాల్‌ క్యాప్‌ సైతం 1 శాతం నీరసించి 13,475 వద్ద స్థిరపడింది.

టైటన్‌ పతనం
గత వారం నిఫ్టీ దిగ్గజాలలో ఇన్‌ఫ్రాటెల్‌, ఐసీఐసీఐ, హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హెచ్‌డీఎఫ్‌సీ, యస్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌, ఇన్ఫోసిస్‌ 7-3 శాతం మధ్య ఎగశాయి. అయితే టైటన్‌ కంపెనీ 11 శాతం పతనంకాగా.. జీ, ఐవోసీ, యూపీఎల్‌, మారుతీ, హెచ్‌యూఎల్‌, ఓఎన్‌జీసీ, సన్‌ ఫార్మా, టాటా మోటార్స్‌, బ్రిటానియా, బీపీసీఎల్‌ 7-3.3 శాతం మధ్య వెనకడుగు వేశాయి.

రేమండ్‌ జూమ్‌
గత వారం మిడ్‌ క్యాప్స్‌లో రేమండ్‌ 37 శాతం దూసుకెళ్లగా.. ఐబీ ఇంటిగ్రేటెడ్‌, దివాన్‌ హౌసింగ్‌, కాఫీ డే, ఆర్‌ఇన్‌ఫ్రా, ఆర్‌కేపిటల్‌, లక్ష్మీ విలాస్‌, ఐబీ రియల్టీ, అవంతీ ఫీడ్స్‌, వరుణ్‌ బెవరేజెస్‌ 27-19 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు ఇంటెలెక్ట్‌, జీఈ టీ, డిష్‌ టీవీ, సెంట్రల్‌ బ్యాంక్‌, మ్యాగ్మా, బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌, వీమార్ట్‌, ఇంజినీర్స్‌, అపోలో టైర్స్‌, గుజరాత్‌ ఆల్క, ప్రిజమ్‌ 24-12 శాతం మధ్య కుప్పకూలాయి.