ఎస్‌అండ్‌పీ- నాస్‌డాక్‌ రికార్డ్స్‌

ఎస్‌అండ్‌పీ- నాస్‌డాక్‌ రికార్డ్స్‌

వారాంతాన మరోసారి అమెరికా స్టాక్‌ మార్కెట్లు సరికొత్త గరిష్టాల వద్ద నిలిచాయి. డోజోన్స్‌ 6 పాయింట్ల(0.02 శాతం) నామమాత్ర లాభంతో 27,681 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 8 పాయింట్లు(0.3 శాతం) బలపడి 3,093 వద్ద ముగిసింది. ఇక నాస్‌డాక్‌ సైతం 40 పాయింట్లు(0.5 శాతం) ఎగసి 8,475 వద్ద నిలిచింది. వెరసి ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌ చరిత్రాత్మక గరిష్టాల వద్ద స్థిరపడ్డాయి. అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాద పరిష్కారానికి పాక్షిక ఒప్పందం కుదిరే అంచనాలతో గురువారం సైతం మార్కెట్లు రికార్డులు సాధించిన సంగతి తెలిసిందే. దశలవారీగా టారిఫ్‌ల ఉపసంహరణకు చైనా ప్రభుత్వం సైతం అంగీకరించడంతో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. ప్రధానంగా పౌల్ట్రీ దిగుమతులపై నియంత్రణలను ఎత్తివేయనున్నట్లు ప్రకటించింది. అయితే చైనా దిగుమతులపై టారిఫ్‌ల ఎత్తివేతను ఇంకా నిర్ణయించలేదని అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ తాజాగా పేర్కొనడం గమనార్హం!

ఐదో వారం
గత వారం ఎస్‌అండ్‌పీ నికరంగా 0.9 శాతం పుంజుకోవడం ద్వారా వరుసగా ఐదో వారం లాభాలతో ముగిసింది. ఈ బాటలో నాస్‌డాక్‌ 1.1 శాతం బలపడటం ద్వారా వరుసగా ఆరో వారమూ పురోగమించింది. ఇక డోజోన్స్‌ గత వారం 1.2 శాతం ఎగసింది. తద్వారా మూడు వారాలపాటు ర్యాలీ చేసినట్లయ్యింది!

డిస్నీ జోరు
త్రైమాసిక ఫలితాలు అంచనాలను మించడంతో మీడియా రంగ దిగ్గజం వాల్ట్‌ డిస్నీ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. ఈ షేరు దాదాపు 4 శాతం జంప్‌చేసింది. ఈ వారం ప్రవేశపెట్టనున్న డిస్నీప్లస్‌పై అంచనాలు సైతం ఈ కౌంటర్‌కు జోష్‌నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు.
 
నేలచూపుతో
గురువారం జంప్‌చేసిన 10ఏళ్ల ట్రెజరీ ఈల్డ్స్‌ వారాంతాన స్వల్ప వెనకడుగుతో 1.92 శాతం వద్ద ముగిశాయి. శుక్రవారం యూరోపియన్‌ స్టాక్‌ మార్కెట్లలో జర్మనీ , యూకే 0.6 శాతం చొప్పున బలహీనపడగా.. ఫ్రాన్స్‌ నామమాత్ర నష్టంతో నిలిచింది. ఆసియాలో అధిక శాతం మార్కెట్లు అమ్మకాలతో నీరసించాయి. హాంకాంగ్‌, సింగపూర్‌, చైనా, కొరియా, తైవాన్, థాయ్‌లాండ్‌ 0.7-0.2 శాతం మధ్య డీలాపడగా.. జపాన్‌, ఇండొనేసియా 0.25 శాతం చొప్పున పుంజుకున్నాయి.