చివర్లో పతనం- రియల్టీ ఎదురీత

చివర్లో పతనం- రియల్టీ ఎదురీత

మళ్లీ దేశీ స్టాక్‌ మార్కెట్ల మూడు రోజుల ర్యాలీకి చెక్‌ పడింది. ఉన్నట్టుండి ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఎగబడటంతో మార్కెట్లు చివర్లో పతనబాట పట్టాయి. ట్రేడింగ్ ముగిసేరికి సెన్సెక్స్‌ 330 పాయింట్లు పతనమై 40,324 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 104 పాయింట్లు కోల్పోయి 11,908 వద్ద స్థిరపడింది. వాణిజ్య వివాద పరిష్కారానికి ఒప్పందం కుదరనున్న సంకేతాల కారణంగా గురువారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు సరికొత్త గరిష్టం వద్ద ముగియగా.. ఆసియా, యూరోపియన్‌ మార్కెట్లు నీరసపడ్డాయి. మూడు రోజులుగా మార్కెట్లు ర్యాలీ చేయడంతో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ప్రధానంగా దేశ ఔట్‌లుక్‌ రేటింగ్‌ను స్థిరత్వం నుంచి ప్రతికూలానికి మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ సవరించడంతో సెంటిమెంటుకు దెబ్బతగిలినట్లు పేర్కొన్నారు. 

ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ...
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌, పీఎస్‌యూ బ్యాంక్స్‌, ఐటీ, ఆటో 2.4-1 శాతం మధ్య క్షీణించగా.. రియల్టీ 2 శాతం బలపడింది. ప్రయివేట్‌ బ్యాంక్స్‌ 0.7 శాతం పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇన్‌ఫ్రాటెల్‌, సన్‌ ఫార్మా, గెయిల్‌, యూపీఎల్‌, వేదాంతా, ఓఎన్‌జీసీ, టీసీఎస్, హెచ్‌యూఎల్‌, బీపీసీఎల్‌,  డాక్టర్‌ రెడ్డీస్ 5-2 శాతం మధ్య డీలాపడ్డాయి. అయితే యస్‌ బ్యాంక్‌ 5 శాతం జంప్‌చేయగా.. ఐసీఐసీఐ, ఇండస్‌ఇండ్, ఐషర్, కొటక్‌ బ్యాంక్‌, జీ 3-0.5 శాతం మధ్య లాభపడ్డాయి. 

భారత్‌ ఫోర్జ్‌ పతనం
డెరివేటివ్‌ కౌంటర్లలో భారత్‌ ఫోర్జ్‌ 9 శాతం కుప్పకూలగా.. హెచ్‌పీసీఎల్‌, కెనరా బ్యాంక్‌, బెర్జర్‌ పెయింట్స్‌, క్యాస్ట్రాల్, మదర్‌సన్‌ 5.5-4 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. మరోవైపు ఐజీఎల్, ఎన్‌సీసీ, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, వోల్టాస్‌, ఇండిగో, టాటా పవర్‌ 7-2 శాతం మధ్య జంప్‌చేశాయి. ఇక రియల్టీ కౌంటర్లలో డీఎల్‌ఎఫ్‌, ఇండియాబుల్స్‌, బ్రిగేడ్‌, ఫినిక్స్‌, ఒబెరాయ్‌, శోభా 5.4-0.6 శాతం మధ్య ఎగశాయి.

చిన్న షేర్లు డౌన్
మార్కెట్లు చివర్లో పతనమైన నేపథ్యంలో మధ్య,చిన్నతరహా కౌంటర్లకూ అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.8-0.5 శాతం చొప్పున బలహీనపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1475 నష్టపోగా.. 1045 లాభపడ్డాయి. 

ఎఫ్‌పీఐల అండ
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దాదాపు రూ. 927 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) దాదాపు రూ. 636 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. కాగా.. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 1011 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 1117 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించిన సంగతి తెలిసిందే!