భారత్‌ ఫోర్జ్‌- గెయిల్‌.. Q2 షాక్‌

భారత్‌ ఫోర్జ్‌- గెయిల్‌.. Q2 షాక్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు సాధించడంతో ఆటో విడిభాగాల రంగ దిగ్గజం భారత్‌ ఫోర్జ్‌ లిమిటెడ్‌ కౌంటర్‌లో అమ్మకాలు ఊపందుకున్నాయి. కాగా.. మరోపక్క ఈ ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్‌) ఫలితాలు నిరాశ పరచడంతో ప్రభుత్వ రంగ కంపెనీ గ్యాస్ అథారిటీ ఆఫ్‌ ఇండియా(గెయిల్‌) లిమిటెడ్‌ కౌంటర్‌లోనూ అమ్మకాలు తలెత్తాయి. దీంతో ఈ రెండు కౌంటర్లూ భారీ నష్టాలతో డీలాప కళతప్పాయి. వివరాలు చూద్దాం..

భారత్ ఫోర్జ్‌ లిమిటెడ్‌
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన భారత్ ఫోర్జ్‌ లిమిటెడ్‌ నిర్వహణ లాభం 27 శాతం క్షీణించి రూ. 251 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం సైతం 16 శాతం వెనకడుగుతో రూ. 2158 కోట్లకు చేరింది. ఇబిటా మార్జిన్లు 21.7 శాతం నుంచి 14.7 శాతానికి బలహీనపడ్డాయి. ఇండియాసహా ఉత్తర అమెరికా, యూరోప్‌లలో మందగమన పరిస్థితుల కారణంగా ఈ ఏడాది ద్వితీయార్థంలో పనితీరు మరింత నీరసించే వీలున్నట్లు భారత్ ఫోర్జ్‌ అంచనా వేసింది. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో భారత్ ఫోర్జ్‌ లిమిటెడ్‌ షేరు 8 శాతం పతనమై రూ. 432 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 429 దిగువకూ పతనమైంది. 

Image result for GAIL Ltd

గెయిల్‌ లిమిటెడ్‌
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో గెయిల్‌ లిమిటెడ్‌ నికర లాభం 17 శాతం క్షీణించి రూ. 1064 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం నామమాత్ర వెనకడుగుతో రూ. 18,039 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం 30 శాతం నీరసించి రూ. 1563 కోట్లను తాకింది. ఇబిటా మార్జిన్లు 12.33 శాతం నుంచి 8.6 శాతానికి బలహీనపడ్డాయి. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో గెయిల్‌ లిమిటెడ్‌ షేరు 4.5 శాతం పతనమై రూ. 127 దిగువన ట్రేడవుతోంది.