రేమండ్‌ దూకుడు- థైరోకేర్‌ సైతం

రేమండ్‌ దూకుడు- థైరోకేర్‌ సైతం

లైఫ్‌స్టైల్‌ బిజినెస్‌ను ప్రత్యేక కంపెనీగా విడదీసేందుకు నిర్ణయించినట్లు వెల్లడించడంతో డైవర్సిఫైడ్‌ బిజినెస్‌ల దిగ్గజం రేమండ్‌ లిమిటెడ్‌ కౌంటర్‌కు డిమాండ్‌ ఊపందుకుంది. కాగా.. మరోపక్క ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో డయాగ్నోస్టిక్‌, పాథాలజీ ల్యాబ్‌ల నిర్వాహక కంపెనీ థైరోకేర్‌ టక్నాలజీస్‌ లిమిటెడ్‌ కౌంటర్‌ సైతం వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూ కట్టడంతో నష్టాల మార్కెట్లోనూ ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. 

రేమండ్‌ లిమిటెడ్‌
కంపెనీకి కీలకమైన లైఫ్‌స్టైల్‌ బిజినెస్‌ను ప్రత్యేక కంపెనీగా విడదీసే ప్రణాళికలు రూపొందించినట్లు రేమండ్‌ లిమిటెడ్‌ తాజాగా పేర్కొంది. అంతేకాకుండా ఈ కంపెనీని స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్ట్‌ చేయనున్నట్లు తెలియజేసింది. ఇందుకు వీలుగా  1:1 నిష్పత్తిలో అంటే.. ప్రస్తుత రేమండ్‌ లిమిటెడ్‌ వాటాదారులకు తమ వద్దగల ప్రతీ షేరుకి లైఫ్‌స్టైల్‌ కంపెనీ షేరుని కేటాయించనున్నట్లు వివరించింది. తద్వారా గ్రూప్‌ నిర్మాణాన్ని సరళతరం చేయనున్నట్లు తెలియజేసింది. టెక్స్‌టైల్స్‌, ఫ్యాషన్‌ రిటైల్‌ తదితర బిజినెస్‌ల రేమండ్‌ లిమిటెడ్‌ కంపెనీలో ప్రమోటర్లకు 43.99% వాటా ఉంది. ఈ వార్తల నేపథ్యంలో ప్రస్తుతం రేమండ్‌ లిమిటెడ్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 18 శాతం దూసుకెళ్లింది. రూ. 792 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 800 వరకూ ఎగసింది.

Related image

థైరోకేర్‌ టెక్నాలజీస్‌
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో థైరోకేర్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ నికర లాభం 39 శాతం ఎగసి రూ. 35 కోట్లను అధిగమించింది. మొత్తం ఆదాయం 12 శాతం పెరిగి రూ. 169 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం సైతం 21 శాతం పుంజుకుని రూ. 52 కోట్లను తాకింది. ఇబిటా మార్జిన్లు 41.5 శాతం నుంచి 44.8 శాతానికి బలపడ్డాయి. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో థైరోకేర్‌ టెక్నాలజీస్‌ షేరు 5.3 శాతం జంప్‌చేసి రూ. 588 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 604ను అధిగమించింది.