ఐజీఎల్‌- డీఎల్‌ఎఫ్‌.. Q2 స్పీడ్‌

ఐజీఎల్‌- డీఎల్‌ఎఫ్‌.. Q2 స్పీడ్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్‌(ఐజీఎల్‌) కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. కాగా.. మరోపక్క ఈ ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్‌) ఫలితాలు మెప్పించనప్పటికీ.. రియల్టీ రంగ దిగ్గజం డీఎల్‌ఎఫ్‌ లిమిటెడ్‌ కౌంటర్‌ సైతం వెలుగులోకి వచ్చింది. రియల్టీ రంగానికి దన్నుగా కేంద్ర ఆర్థిక శాఖ రూ. 25,000 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఫండ్‌ ఇందుకు సహకరిస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో నష్టాల మార్కెట్లోనూ ఈ రెండు కౌంటర్లూ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

Related image

ఐజీఎల్‌ లిమిటెడ్‌
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో ఐజీఎల్‌ నికర లాభం రెట్టింపునకు ఎగసి రూ. 381 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 19 శాతం పెరిగి రూ. 1692 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం సైతం 27 శాతం పుంజుకుని రూ. 393 కోట్లను తాకింది. ఇబిటా మార్జిన్లు 21.7 శాతం నుంచి 23.2 శాతానికి బలపడ్డాయి. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఐజీఎల్‌ లిమిటెడ్‌ షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 413 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 416 సమీపంలో 52 వారాల గరిష్టాన్ని అందుకుంది. 

డీఎల్‌ఎఫ్‌ లిమిటెడ్‌
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో డీఎల్‌ఎఫ్‌ లిమిటెడ్‌ నికర లాభం 19 శాతం ఎగసి రూ. 446 కోట్లను తాకింది. ఈ కాలంలో రూ. 144 కోట్లమేర అనూహ్య లాభం ఆర్జించినట్లు కంపెనీ తెలియజేసింది. మొత్తం ఆదాయం మాత్రం 19 శాతం క్షీణించి రూ. 1716 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం మరింత అధికంగా 47 శాతం వెనకడుగుతో రూ. 350 కోట్లకు పరిమితమైంది. ఇబిటా మార్జిన్లు 30.8 శాతం నుంచి 20.4 శాతానికి బలహీనపడ్డాయి. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో డీఎల్‌ఎఫ్‌ లిమిటెడ్‌ షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 202 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 204ను అధిగమించింది.