నేలచూపుతో- రియల్టీ జోరు

నేలచూపుతో- రియల్టీ జోరు

దేశీ స్టాక్‌ మార్కెట్ల మూడు రోజుల ర్యాలీకి చెక్‌ పడింది. ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఆసక్తి చూపడంతో నేలచూపుతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 86 పాయింట్లు క్షీణించి 40,568కు చేరగా.. నిఫ్టీ 28 పాయింట్లు నీరసించి 11,984 వద్ద ట్రేడవుతోంది. వాణిజ్య వివాద పరిష్కారానికి ఒప్పందం కుదరనున్న సంకేతాల కారణంగా గురువారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు సరికొత్త గరిష్టం వద్ద ముగిశాయి. మూడు రోజులుగా మార్కెట్లు ర్యాలీ చేస్తున్న నేపథ్యంలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. 

ఫార్మా వీక్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా రియల్టీ 2.2 శాతం, ప్రయివేట్‌ బ్యాంక్స్‌, మీడియా 0.5 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఫార్మా 0.6 శాతం బలహీనపడింది. నిఫ్టీ దిగ్గజాలలో యస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ, ఇండస్‌ఇండ్, ఎంఅండ్ఎం, జీ, కోల్‌ ఇండియా, టెక్‌ మహీంద్రా, బ్రిటానియా, హీరో మోటో, హెచ్‌సీఎల్‌ టెక్‌ 3-0.5 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే ఇన్‌ఫ్రాటెల్‌, యూపీఎల్‌, సన్‌ ఫార్మా, సిప్లా, టాటా స్టీల్‌, ఎయిర్‌టెల్, గెయిల్, ఆర్‌ఐఎల్‌, డాక్టర్‌ రెడ్డీస్, వేదాంతా 2-0.6 శాతం మధ్య డీలాపడ్డాయి. 

ఐజీఎల్‌ జోరు
డెరివేటివ్‌ కౌంటర్లలో ఐజీఎల్, బీఈఎల్‌, డిష్‌ టీవీ, వోల్టాస్‌ 5-2 శాతం మధ్య జంప్‌చేయగా.. మ్యాక్స్‌ ఫైనాన్స్‌, ఐడియా, ఐబీ హౌసింగ్‌, భెల్‌, ఉజ్జీవన్‌, సెయిల్‌ 2.6-1.25 శాతం మధ్య క్షీణించాయి. కాగా.. రియల్టీ కౌంటర్లలో బ్రిగేడ్‌, డీఎల్‌ఎఫ్‌, ఇండియాబుల్స్‌, ఫినిక్స్‌, శోభా 5-1 శాతం మధ్య ఎగశాయి.

చిన్న షేర్లు ఓకే 
మార్కెట్లు నేలచూపులతో ప్రారంభమైనప్పటికీ మధ్య,చిన్నతరహా కౌంటర్లకు ఓమాదిరి డిమాండ్‌ కనిపిస్తోంది. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.2 శాతం స్థాయిలో బలపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 749 లాభపడగా.. 634 నష్టాలతో ట్రేడవుతున్నాయి.