బ్లూచిప్స్‌ దన్ను- యూఎస్‌ రికార్డ్‌

బ్లూచిప్స్‌ దన్ను- యూఎస్‌ రికార్డ్‌

వాణిజ్య వివాద పరిష్కారానికి పాక్షిక ఒప్పందం కుదిరే అంశంపై అంచనాలు పెరగడంతో గురువారం ఇన్వెస్టర్లకు హుషారొచ్చింది. దీంతో  రెండు రోజులపాటు కన్సాలిడేషన్‌ బాటలో సాగిన అమెరికా స్టాక్‌ మార్కెట్లు జోరందుకున్నాయి. డోజోన్స్‌ 182 పాయింట్లు(0.65 శాతం) ఎగసి 27,675 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 8 పాయింట్ల(0.3 శాతం) లాభంతో 3,085 వద్ద ముగిసింది. వెరసి సరికొత్త గరిష్టాల వద్ద స్థిరపడ్డాయి. ఇక నాస్‌డాక్‌ సైతం 24 పాయింట్లు(0.3 శాతం) పుంజుకుని 8,435 వద్ద నిలిచింది. దశలవారీగా టారిఫ్‌ల ఉపసంహరణకు చైనా ప్రభుత్వం సైతం అంగీకరించడంతో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. ప్రధానంగా పౌల్ట్రీ దిగుమతులపై నియంత్రణలను ఎత్తివేయనున్నట్లు ప్రకటించింది. అయితే చైనా దిగుమతులపై టారిఫ్‌ల ఎత్తివేతను అమెరికా చేపట్టవలసి ఉంది. ఇందుకు ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత వ్యక్తంకావచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.

Image result for ralph lauren corporation

క్వాల్‌కామ్‌ జోరు
అమెరికా, చైనా దోస్తీపై అంచనాలతో బ్లూచిప్స్‌ కేటర్‌పిల్లర్‌, బోయింగ్‌ 1 శాతం చొప్పున బలపడ్డాయి. బాండ్ల ఈల్డ్స్‌ పుంజుకోవడంతో సిటీగ్రూప్‌, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా, జేపీ మోర్గాన్‌ చేజ్‌ 2-0.5 శాతం మధ్య ఎగశాయి. తాజా త్రైమాసికంలో అంచనాలను మించిన ఫలితాలు ప్రకటించడంతో చిప్‌ తయారీ దిగ్గజం క్వాల్‌కామ్‌ ఇంక్‌ షేరు 6.3 శాతం జంప్‌చేసింది. వ్యయాల అదుపు, పోలో టీషర్ట్‌లకు భారీ డిమాండ్‌ నేపథ్యంలో రాల్ఫ్‌ లారెన్ కార్ప్‌ పటిష్ట ఫలితాలు సాధించింది. దీంతో ఈ షేరు దాదాపు 15 శాతం దూసుకెళ్లింది. అయితే త్రైమాసిక ఫలితాలు నిరాశపరచడంతో ఆన్‌లైన్‌ ట్రావెల్‌ బుకింగ్‌ కంపెనీ ఎక్స్‌పెడియా గ్రూప్‌ ఇంక్‌ 27 శాతంపైగా కుప్పకూలింది.

బాండ్ల ఈల్డ్స్‌ అప్‌
అమెరికా ప్రెసిడెంట్‌గా ట్రంప్‌ ఎన్నికయ్యాక తొలిసారి 10ఏళ్ల ట్రెజరీ ఈల్డ్స్‌ ఒకేరోజు 0.14 శాతం ఎగశాయి. 1.95 శాతానికి చేరాయి. గురువారం యూరోపియన్‌ స్టాక్‌ మార్కెట్లలో జర్మనీ 0.8 శాతం, ఫ్రాన్స్‌ 0.4 శాతం, యూకే 0.15 శాతం చొప్పున బలపడ్డాయి. ప్రస్తుతం ఆసియాలో అధిక శాతం మార్కెట్లు అమ్మకాలతో నీరసించాయి. సింగపూర్‌, హాంకాంగ్‌, తైవాన్, కొరియా, ఇండొనేసియా 0.8-0.1 శాతం మధ్య క్షీణించగా..  జపాన్, థాయ్‌లాండ్‌ నామమాత్ర లాభాలతో కదులుతున్నాయి. చైనా 0.3 శాతం పుంజుకుంది.