నష్టాల ఓపెనింగ్‌ నేడు?!

నష్టాల ఓపెనింగ్‌ నేడు?!

దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ప్రస్తుతం సింగపూర్(ఎస్‌జీఎక్స్) నిఫ్టీ 64 పాయింట్లు క్షీణించి 11,995 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్ల ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. కాగా.. రెండు రోజులపాటు కన్సాలిడేట్‌ అయిన అమెరికా స్టాక్‌ మార్కెట్లు గురువారం తిరిగి జోరందుకున్నాయి. డోజోన్స్‌ సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాద పరిష్కార ఒప్పందంపై అంచనాలు ఇన్వెస్టర్లకు జోష్‌నిచ్చినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇక దేశీయంగా మూడు రోజులపాటు మళ్లీ ర్యాలీ చేసిన మార్కెట్లలో నేడు లాభాల స్వీకరణ జరిగే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. 

మూడో రోజూ రికార్డ్‌
గురువారం వరుసగా మూడో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ప్రపంచ సంకేతాలు అటూఇటుగా ఉన్నప్పటికీ హుషారుగా ప్రారంభమైన మార్కెట్లు రోజంతా పటిష్టంగా కదిలాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ప్రాధాన్యత ఇవ్వడంతో చివరి సెషన్‌కల్లా సెన్సెక్స్‌ 40,688 పాయింట్ల వద్ద సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. చివరికి 184 పాయింట్లు పెరిగి 40,654 వద్ద నిలిచింది. ఇక నిఫ్టీ సైతం 46 పాయింట్లు పుంజుకుని 12,012 వద్ద స్థిరపడింది. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలు  దేశీయంగా సెంటిమెంటుకు బలాన్నిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. 

ఎఫ్‌పీఐల అండ
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దాదాపు రూ. 927 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) దాదాపు రూ. 636 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. కాగా.. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 1011 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 1117 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించాయి.