మూడో రోజూ అదే జోరు!

మూడో రోజూ అదే జోరు!

వరుసగా మూడో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ప్రపంచ సంకేతాలు అటూఇటుగా ఉన్నప్పటికీ హుషారుగా ప్రారంభమైన మార్కెట్లు రోజంతా పటిష్టంగా కదిలాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ప్రాధాన్యత ఇవ్వడంతో చివరి సెషన్‌కల్లా సెన్సెక్స్‌ 40,688 పాయింట్ల వద్ద సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. చివరికి 184 పాయింట్లు పెరిగి 40,654 వద్ద నిలిచింది. ఇక నిఫ్టీ సైతం 46 పాయింట్లు పుంజుకుని 12,012 వద్ద స్థిరపడింది. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలు  దేశీయంగా సెంటిమెంటుకు బలాన్నిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. కాగా.. వాణిజ్య వివాద పరిష్కార ఒప్పందం డిసెంబర్‌ వరకూ కుదిరే వీలులేదన్న వార్తల నేపథ్యంలో బుధవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజు ఫ్లాట్‌గా ముగిశాయి. 

ప్రభుత్వ బ్యాంక్స్‌ వీక్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంక్స్‌ 1.5 శాతం నీరసించగా.. మెటల్, రియల్టీ, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ 1-0.5 శాతం మధ్య బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇన్‌ఫ్రాటెల్‌, సన్‌ ఫార్మా, ఇండస్‌ఇండ్, హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, వేదాంతా, ఆర్‌ఐఎల్‌, ఐటీసీ, ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ 3.6-1.3 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే యూపీఎల్‌ 8 శాతం పతనంకాగా.. యస్‌ బ్యాంక్‌, గెయిల్, బీపీసీఎల్‌, సిప్లా, టాటా మోటార్స్‌, ఓఎన్‌జీసీ, హెచ్‌యూఎల్‌, యాక్సిస్, ఎల్‌అండ్‌టీ 3.5-1 శాతం మధ్య డీలాపడ్డాయి. 

జిందాల్‌ జోరు
డెరివేటివ్‌ కౌంటర్లలో జిందాల్‌ స్టీల్‌ 11 శాతం దూసుకెళ్లగా.. ఐబీ హౌసింగ్‌, ఎన్‌బీసీసీ, మ్యాక్స్‌ ఫైనాన్స్‌, ఆర్‌ఈసీ, అపోలో హాస్పిటల్స్‌, జూబిలెంట్‌ ఫుడ్‌, హావెల్స్‌, పిరమల్‌ 8.7-3.5 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క ఎన్‌ఎండీసీ, లుపిన్‌, పీఎన్‌బీ, బీవోబీ, గ్లెన్‌మార్క్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యూనియన్‌ బ్యాంక్‌ 5-2.5 శాతం మధ్య పతనమయ్యాయి. 

చిన్న షేర్లూ 
మార్కెట్లు హుషారుగా కదిలిన నేపథ్యంలో మధ్య,చిన్నతరహా కౌంటర్లకూ డిమాండ్‌ నెలకొంది. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.6 శాతం స్థాయిలో బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1334 లాభపడగా.. 1185 నష్టాలతో ముగిశాయి.

ఎఫ్‌పీఐల అండ
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1011 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 1117 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించాయి. కాగా.. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 473 కోట్లను ఇన్వెస్ట్ చేయగా..  డీఐఐలు దాదాపు రూ. 1594 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. ఇక సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 139 కోట్లు, డీఐఐలు రూ. 500 కోట్లు చొప్పున విలువైన స్టాక్స్‌ విక్రయించిన సంగతి తెలిసిందే.