సన్‌ ఫార్మా క్యూ2 ఓకే- షేరు అప్‌

సన్‌ ఫార్మా క్యూ2 ఓకే- షేరు అప్‌

ఫార్మా రంగ దేశీ దిగ్గజం సన్‌ ఫార్మాస్యూటికల్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) రెండో త్రైమాసికంలో టర్న్‌ అరౌండ్‌ ఫలితాలు ప్రకటించింది. ఈ ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో సన్‌ ఫార్మా రూ. 1065 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది క్యూ2లో రూ. 270 కోట్ల నికర నష్టం నమోదైంది. అయితే 2019 క్యూ2లో రూ. 1214 కోట్ల వన్‌టైమ్‌ లాస్‌ నమోదైనట్లు కంపెనీ పేర్కొంది. కాగా.. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం 17 శాతం పెరిగి రూ. 8123 కోట్లను తాకింది. నిర్వహణ లాభం సైతం 17 శాతం పుంజుకుని రూ. 1790 కోట్లకు  చేరింది. ఇతర ఆదాయం రూ. 351 కోట్ల నుంచి రూ. 201 కోట్లకు తగ్గింది. ఇబిటా మార్జిన్లు యథాతథంగా 22 శాతంగా నమోదయ్యాయి. 

దేశీ అమ్మకాలు అప్‌
మొత్తం ఆదాయంలో దేశీ మార్కెట్ల నుంచి రూ. 2515 కోట్లు సమకూరినట్లు సన్‌ ఫార్మా పేర్కొంది. ఇది 35 శాతం అధికంకాగా.. యూఎస్‌ మార్కెట్‌ అమ్మకాలు యథాతథంగా 33.9 కోట్ల డాలర్లుగా నమోదైనట్లు తెలియజేసింది. వర్ధమాన మార్కెట్ల నుంచి 3 శాతం అధికంగా 20.1 కోట్ల డాలర్ల అమ్మకాలు సాధించగా..  రెస్ట్‌ఆఫ్‌ వరల్డ్ విక్రయాలు 49 శాతం ఎగసి 16.1 కోట్ల డాలర్లను తాకినట్లు సన్‌ ఫార్మా తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో సన్‌ ఫార్మా షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 2.6 శాతం లాభంతో రూ. 439 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 442 వరకూ ఎగసింది.