ఎంఎస్‌టీసీ హైజంప్‌- బజాజ్‌ డౌన్

ఎంఎస్‌టీసీ హైజంప్‌- బజాజ్‌ డౌన్

ఇంజినీరింగ్‌ దిగ్గజం ఎల్‌అండ్‌టీ సెల్లింగ్‌ ఏజెంట్‌గా ఎంపిక చేసుకున్నట్లు వెల్లడించడంతో పీఎస్‌యూ.. ఎంఎస్‌టీసీ లిమిటెడ్‌ కౌంటర్ జోరందుకుంది. ఇటీవల రికవరీ బాటలో సాగుతున్న ఈ షేరు ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూ కట్టడంతో భారీ లాభాలతో సందడి చేస్తోంది. కాగా.. మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) రెండో త్రైమాసికంలో రివర్స్‌ టర్న్‌అరౌండ్‌ ఫలితాలు ప్రకటించడంతో డైవర్సిఫైడ్‌ దిగ్గజం బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ కౌంటర్లో అమ్మకాలు కొనసాగుతున్నాయి. వెరసి ఈ షేరు రెండేళ్ల కనిష్టానికి చేరింది. వివరాలు చూద్దాం..

ఎంఎస్‌టీసీ లిమిటెడ్‌
ప్రయివేట్‌ రంగ దిగ్గజం ఎల్‌అండ్‌టీకు సెల్లింగ్‌ ఏజెంట్‌గా ఎంపికైనట్లు ఎంఎస్‌టీసీ లిమిటెడ్‌ తాజాగా పేర్కొంది. ఈకామర్స్ కార్యకలాపాలు నిర్వహించే ఈ ప్రభుత్వ రంగ కంపెనీ.. స్క్రాప్‌, సెకండరీ ఫెరస్, నాన్‌ఫెరస్‌, పరికరాలు, బిల్డింగుల ఆర్టికల్స్‌ తదితరాలను వెబ్‌సైట్‌ ద్వారా విక్రయించేందుకు ఎల్‌అండ్‌టీతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. ఈఆక్షన్‌ పద్ధతిలో ఎల్‌అండ్‌టీకి సేవలు అందించనున్నట్లు తెలియజేసింది. మరోవైపు ఈ ఆక్షన్‌ సేవల కోసం బర్న్‌ స్టాండర్డ్‌ కంపెనీతో అవగాహనా ఒప్పందాన్ని(ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఎంఎస్‌టీసీ లిమిటెడ్‌ షేరుకి డిమాండ్‌ పెరిగింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో దాదాపు 18 శాతం దూసుకెళ్లి రూ. 145 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 147 ఎగువన 52 వారాల గరిష్టాన్ని తాకింది. కాగా.. ఆగస్ట్ 14న నమోదైన రూ. 70 కనిష్ట ధర నుంచి ఈ షేరు తాజాగా రెట్టింపునకు ఎగసింది. ప్రధానంగా గత 9 రోజుల్లోనే 56 శాతం ర్యాలీ చేయడం విశేషం! 

Image result for bajaj electricals

బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌
ఈ ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో సాధించిన ఫలితాలు అంచనాలను చేరకపోవడంతో హోమ్‌ అప్లయెన్సెస్‌ కంపెనీ బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌ కౌంటర్లో అమ్మకాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌ షేరు 4.5 శాతం పతనమై రూ. 337 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 334 వరకూ జారింది. ఇది రెండేళ్ల కనిష్టంకాగా.. గత రెండు సెషన్లలో 12 శాతం క్షీణించింది. క్యూ2లో కంపెనీ రూ. 32.5 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది(2018-19) క్యూ2లో రూ. 30 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఆదాయం 31 శాతం తగ్గి రూ. 1096 కోట్లకు పరిమితమైంది.