ఫోర్టిస్‌- మ్యాక్స్‌.. క్యూ2 జోష్‌

ఫోర్టిస్‌- మ్యాక్స్‌.. క్యూ2 జోష్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) రెండో త్రైమాసికంలో సాధించిన ఫలితాలు అంచనాలను చేరడంతో ఎన్‌బీఎఫ్‌సీ.. మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌ లిమిటెడ్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పుట్టింది. కాగా.. మరోపక్క ఈ ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో టర్న్‌అరౌండ్‌ ఫలితాలు సాధించడంతో ఆరోగ్య పరిరక్షణ సేవల కంపెనీ ఫోర్టిస్‌ హెల్త్‌కేర్ లిమిటెడ్‌ కౌంటర్‌ సైతం వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ఈ రెండు కౌంటర్లూ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం..

ఫోర్టిస్‌ హెల్త్‌కేర్ లిమిటెడ్‌
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో ప్రయివేట్‌ రంగ సంస్థ ఫోర్టిస్‌ హెల్త్‌కేర్ లిమిటెడ్‌ రూ. 111 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2018-19) క్యూ2లో రూ. 167 కోట్ల నికర నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం 6 శాతం పుంజుకుని రూ. 1212 కోట్లను తాకింది. నిర్వహణ లాభం మూడు రెట్లు పెరిగి రూ. 184 కోట్లను అధిగమించింది. ఇబిటా మార్జిన్లు 5.6 శాతం నుంచి 15.2 శాతానికి ఎగశాయి. ఫైనాన్స్‌ వ్యయాలు 42 శాతం తగ్గి రూ. 49 కోట్లకు పరిమితమయ్యాయి. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 154 వద్ద ట్రేడవుతోంది. ఇది 52 వారాల గరిష్టంకావడం విశేషం!

Image result for max financial services ltd

మ్యాక్స్‌ ఫైనాన్షియల్‌ లిమిటెడ్‌
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో ప్రయివేట్‌ రంగ కంపెనీ మ్యాక్స్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ నికర లాభం 49 శాతం క్షీణించి రూ. 42 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం మాత్రం 8 శాతం పుంజుకుని రూ. 4,659 కోట్లను తాకింది. కొత్త బిజినెస్‌ ప్రీమియం ఆదాయం 22 శాతం ఎగసి రూ. 1730 కోట్లకు చేరింది. కొత్త బిజినెస్‌ మార్జిన్లు 20.4 శాతం నుంచి 21 శాతానికి బలపడ్డాయి. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో మ్యాక్స్‌ ఫైనాన్షియల్‌  షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 460 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 473 వరకూ దూసుకెళ్లింది.