జేబీ జూమ్‌- టాటా స్టీల్‌ వీక్‌

జేబీ జూమ్‌- టాటా స్టీల్‌ వీక్‌

సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్‌) ప్రతిపాదనను తెరమీదకు తీసుకురావడంతో ఫార్మా రంగ దేశీ కంపెనీ జేబీ కెమికల్స్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్స్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. కాగా.. మరోపక్క ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) రెండో త్రైమాసికంలో సాధించిన ఫలితాలు నిరాశ పరచడంతో మెటల్‌ రంగ దిగ్గజం టాటా స్టీల్‌ లిమిటెడ్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి జేబీ కెమికల్స్‌ లాభాలతో కళకళలాడుతుంటే.. టాటా స్టీల్‌ నష్టాలతో కళతప్పింది. వివరాలు చూద్దాం..

జేబీ కెమికల్స్‌ అండ్‌ ఫార్మా
ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ ప్రతిపాదనను బోర్డు పరిశీలించనున్నట్లు జేబీ కెమికల్స్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్స్‌ లిమిటెడ్‌ తాజాగా పేర్కొంది. ఇందుకు ఈ నెల 12న సమావేశంకానున్నట్లు తెలియజేసింది. దీంతో ఈ కౌంటర్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో జేబీ కెమికల్స్‌ షేరు 6 శాతం జంప్‌చేసి రూ. 384 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 388ను సైతం అధిగమించింది. 

Related image

టాటా స్టీల్‌ లిమిటెడ్‌
ఈ ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో ప్రయివేట్‌ రంగ దిగ్గజం టాటా స్టీల్‌ లిమిటెడ్‌ నికర లాభం 16 శాతం పుంజుకుని రూ. 4145 కోట్లను తాకింది. అయితే నికర అమ్మకాలు 15 శాతం క్షీణించి రూ. 34,579 కోట్లకు పరిమితమయ్యాయి. నిర్వహణ లాభం 57 శాతం వెనకడుగుతో రూ. 3820 కోట్లను తాకింది. ఇబిటా మార్జిన్లు 21.5 శాతం నుంచి 11 శాతానికి బలహీనపడ్డాయి. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో టాటా స్టీల్‌ షేరు 3.4 శాతం పతనమై రూ. 391 వద్ద ట్రేడవుతోంది.