రియల్టీ, ఫైనాన్స్ కౌంటర్లకు కిక్‌

రియల్టీ, ఫైనాన్స్ కౌంటర్లకు కిక్‌

నిలిచిపోయిన హౌసింగ్‌ ప్రాజెక్టులను తిరిగి ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిన వార్తలతో పలు హౌసింగ్‌ ఫైనాన్స్‌, కన్‌స్ట్రక్షన్‌, రియల్టీ రంగ కంపెనీల కౌంటర్లకు డిమాండ్‌ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూ కట్టడంతో హౌసింగ్‌ ఫైనాన్స్, మౌలిక సదుపాయాలు, రియల్ ఎస్టేట్‌ అభివృద్ధి కంపెనీ కౌంటర్లన్నీ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

రూ. 25,000 కోట్ల పుష్‌
నిర్మాణాలు నిలిచిపోయిన హౌసింగ్‌ ప్రాజెక్టులకు నిధులు అందించేందుకు వీలుగా ప్రత్యేకించిన ఫండ్‌ను ఏర్పాటు చేసేందుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. ఇందుకు వీలుగా ప్రత్యామ్నాయ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. అన్ని రకాల పెట్టుబడులను ఈ ఫండ్‌కు అనుసంధానించడంతోపాటు.. ప్రభుత్వం రూ. 10,000 కోట్లను అందించనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. అందుబాటు ధరలు, మధ్యస్థాయి ఆదాయ హౌసింగ్‌ ప్రాజెక్టులను పునరుద్ధరించే బాటలో తాజా చర్యలకు ఉపక్రమించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ ఫండ్‌లో ప్రభుత్వానికితోడు పీఎస్‌యూ దిగ్గజాలు స్టేట్‌ బ్యాంక్‌, లైఫ్‌ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌(ఎల్‌ఐసీ) సైతం పెట్టుబడులను సమకూర్చనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఫండ్‌ రూ. 25,000 కోట్లకు చేరనున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి.  
 
షేర్ల జోరు
సుమారు రూ. 25,000 కోట్ల పెట్టుబడులతో హౌసింగ్‌ ప్రాజెక్టుల పునరుద్ధరణకు ప్రభుత్వం ఫండ్‌ను ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో పలు కౌంటర్లు జోరందుకున్నాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో పీఎస్‌యూ దిగ్గజం ఎన్‌బీసీసీ లిమిటెడ్‌ 10 శాతం దూసుకెళ్లి రూ. 42 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 46 వరకూ ఎగసింది. ఈ బాటలో నిధుల సమీకరణ ప్రణాళికలు వెల్లడించడంతో ప్రయివేట్‌ రంగ కంపెనీ ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేరు 11 శాతం జంప్‌చేసి రూ. 244 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో 20 శాతం దూసుకెళ్లి రూ. 262ను సైతం అధిగమించింది. ఇక హౌసింగ్‌ నిర్మాణాల కంపెనీ కెపాసైట్‌ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్‌ షేరు సైతం 8.4 శాతం పెరిగి రూ. 237 వద్ద ట్రేడవుతోంది.

ఇతర కౌంటర్లూ
రియల్టీ కౌంటర్లలో ఇండియాబుల్స్‌, శోభా, ఒబెరాయ్‌, ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ 5-1 శాతం మధ్య లాభపడ్డాయి. ఈ బాటలో బీఎస్‌ఈలో అన్సాల్‌ హౌసింగ్‌, పెనిన్సులర్‌, అరిహంత్‌ 20-12 శాతం మధ్య దూసుకెళ్లాయి. ఇతర కౌంటర్లలో మ్యాక్స్‌ ఫైనాన్స్‌, జేఎం ఫైనాన్స్‌, ఐబీ వెంచర్స్, రిలయన్స్‌ హోమ్‌, దివాన్‌ హౌసింగ్‌, రిలయన్స్‌ కేపిటల్ తదితరాలు 7-5 శాతం మధ్య జంప్‌చేశాయి.