ర్యాలీ బాట- సెన్సెక్స్‌ రికార్డ్‌

ర్యాలీ బాట- సెన్సెక్స్‌ రికార్డ్‌

ప్రపంచ సంకేతాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ వరుసగా మూడో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. తదుపరి మరింత జోరందుకున్నాయి. వెరసి సెన్సెక్స్‌ 40,657 పాయింట్లను అధిగమించడం ద్వారా సరికొత్త గరిష్టాన్ని తాకింది. ప్రస్తుతం 164 పాయింట్లు ఎగసి 40,633కు చేరింది. ఇక నిఫ్టీ 42 పాయింట్లు పుంజుకుని 12,008 వద్ద ట్రేడవుతోంది. ఏడు రోజుల వరుస ర్యాలీకి సోమవారం బ్రేక్‌ పడగా.. గత రెండు రోజులుగా మార్కెట్లు లాభాలతో ముగుస్తున్న విషయం విదితమే. కాగా.. వాణిజ్య వివాద పరిష్కార ఒప్పందం డిసెంబర్‌ వరకూ కుదిరే వీలులేదన్న వార్తల నేపథ్యంలో బుధవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజు ఫ్లాట్‌గా ముగిశాయి. 

మెటల్‌, ఆటో వీక్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా రియల్టీ 2 శాతం, బ్యాంక్‌ నిఫ్టీ 0.5 శాతం చొప్పున బలపడ్డాయి. మెటల్‌, ఆటో రంగాలు 0.7-0.4 శాతం మధ్య బలహీనపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇన్‌ఫ్రాటెల్‌, ఇండస్‌ఇండ్, అల్ట్రాటెక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐటీసీ, జీ, సన్‌ ఫార్మా, టీసీఎస్‌, గ్రాసిమ్‌, ఎస్‌బీఐ 2.5-0.6 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే టాటా స్టీల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, వేదాంతా, యస్‌ బ్యాంక్‌, బీపీసీఎల్‌, హీరో మోటో, ఐషర్‌, టాటా మోటార్స్‌, ఐసీఐసీఐ 2.5-0.6 శాతం మధ్య డీలాపడ్డాయి. 

ఐబీ హౌసింగ్‌ జోరు
డెరివేటివ్‌ కౌంటర్లలో ఐబీ హౌసింగ్‌, ఎన్‌బీసీసీ 12 శాతం చొప్పున దూసుకెళ్లగా.. పిరమల్‌, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్, ఎల్‌ఐసీ హౌసింగ్‌, ఐడియా, శ్రీరామ్‌ ట్రాన్స్‌, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌ 7.6-2.6 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క బాష్‌, మ్యాక్స్‌ ఫైనాన్స్‌, లుపిన్‌, ఎన్‌ఎండీసీ, సెయిల్‌, సెంచురీ టెక్స్‌, అపోలో టైర్‌, అశోక్‌ లేలాండ్ 3.2-1.25 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. రియల్టీ కౌంటర్లలో ఇండియాబుల్స్‌, శోభా, ప్రెస్టేజ్‌, ఒబెరాయ్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, డీఎల్‌ఎఫ్‌, బ్రిగేడ్‌ 5-1.5 శాతం మధ్య జంప్‌చేశాయి.

చిన్న షేర్లూ 
మార్కెట్లు హుషారుగా ప్రారంభమైన నేపథ్యంలో మధ్య,చిన్నతరహా కౌంటర్లకూ డిమాండ్‌ కనిపిస్తోంది. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.65 శాతం స్థాయిలో బలపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 831 లాభపడగా.. 443 నష్టాలతో ట్రేడవుతున్నాయి. స్మాల్‌క్యాప్స్‌లో కెపాసైట్‌, యూనిప్లై, జైకార్ప్‌, సొమానీ సిరామిక్స్‌, క్లారియంట్‌, ఆర్‌ఐఐఎల్‌, సీమెక్, జేఎం ఫైనాన్స్, జేబీ కెమ్‌, హోండా పవర్‌ తదితరాలు 11-6 శాతం మధ్య జంప్‌చేశాయి.