డీల్‌ డిసెంబర్‌లో- హెచ్‌పీ జోష్‌

డీల్‌ డిసెంబర్‌లో- హెచ్‌పీ జోష్‌

వాణిజ్య వివాద పరిష్కారానికి పాక్షిక ఒప్పందం డిసెంబర్‌లో మాత్రమే కుదిరే వీలున్నట్లు వెలువడిన వార్తల నేపథ్యంలో వరుసగా రెండో రోజు అమెరికా స్టాక్‌ మార్కెట్లు అక్కడక్కడే అన్నట్లుగా ముగిశాయి. వెరసి బుధవారం డోజోన్స్‌ 7 పాయింట్లు(0.01 శాతం) బలహీనపడి 27,493 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 2 పాయింట్ల(0.01 శాతం) నామమాత్ర లాభంతో 3,077 వద్ద ముగిసింది. అయితే నాస్‌డాక్‌ 24 పాయింట్లు(0.3 శాతం) క్షీణించి 8,411 వద్ద స్థిరపడింది. డీల్‌ కుదుర్చుకోవడానికి డిసెంబర్‌ వరకూ వేచి చూడనున్నట్లు అటు ప్రెసిడెంట్‌ ట్రంప్‌, ఇటు చైనీస్‌ ప్రీమియర్‌ జిన్‌పింగ్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. డీల్‌ కుదుర్చుకునే ప్రాంతం, నిబంధనలు తదితరాలను ఎంపిక చేసుకునేందుకు వీలుగా డిసెంబర్‌వరకూ ఇరువురు నేతలూ సమావేశాన్ని వాయిదా వేసేందుకు నిర్ణయించుకన్నట్లు వార్తలు వెలువడ్డాయి. లండన్‌లో డిసెంబర్‌ 3,4 మధ్య నాటో నేతలు సమావేశంకానున్న నేపథ్యంలో డీల్‌ వాయిదా పడినట్లు తెలుస్తోంది.

Image result for faang companies

ఫాంగ్‌ స్టాక్స్‌ వీక్‌
ఫాంగ్‌ స్టాక్స్‌గా పిలిచే ఫేస్‌బుక్‌, అమెజాన్‌, యాపిల్‌, మైక్రోసాఫ్ట్‌ వెనకడుగు వేయడంతో ప్రధానంగా నాస్‌డాక్‌ ఇండెక్స్‌ నీరసించింది. కాగా.. పెర్సనల్‌ కంప్యూటర్‌, ప్రింటర్ల దిగ్గజం హ్యూలెట్‌ ప్యాకార్డ్‌(హెచ్‌పీ) ఇంక్‌ కొనుగోలుకి జెరాక్స్‌ నగదు, స్టాక్‌ ఆఫర్‌ను ప్రకటించింది. దీంతో హెచ్‌పీ ఇంక్‌ షేరు 6 శాతం జంప్‌చేసింది. తాజా త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు ప్రకటించడంతో సీవీఎస్‌ హెల్త్‌ 5.3 శాతం ఎగసింది. ప్రభుత్వ మెడికేర్‌ ప్రణాళికల కారణంగా హ్యుమానా ఇంక్‌ 3.5 శాతం లాభపడింది. హెల్త్‌కేర్‌ స్టాక్స్‌ డా విస్టా 13 శాతం దూసుకెళ్లింది. అయితే పనితీరు నిరాశపరచడంతో టిండర్‌ ప్రమోటర్‌ మ్యాచ్‌ గ్రూప్‌ షేరు 2.5 శాతం నష్టపోయింది.

మిశ్రమంగా
బుధవారం యూరోపియన్‌ స్టాక్‌ మార్కెట్లలో జర్మనీ, ఫ్రాన్స్‌, యూకే 0.3-0.1 శాతం మధ్య బలపడ్డాయి. ప్రస్తుతం ఆసియాలో మిశ్రమ ధోరణి కనిపిస్తోంది. ఇండొనేసియా, హాంకాంగ్‌, తైవాన్, కొరియా 1-0.1 శాతం మధ్య క్షీణించగా.. థాయ్‌లాండ్‌ 0.3 శాతం పుంజుకుంది. ఇతర మార్కెట్లలో చైనా, సింగపూర్‌ స్వల్ప లాభాలతోనూ.. జపాన్ నామమాత్ర నష్టంతోనూ ట్రేడవుతున్నాయి. 10 ఏళ్ల ట్రెజరీ ఈల్డ్స్‌ 1.82కు చేరగా.. డాలరు ఇండెక్స్‌ 97.95ను తాకింది. డాలరుతో మారకంలో జపనీస్‌ యెన్‌ 108.94 వద్ద ట్రేడవుతోంది. యూరో 1.106కు చేరింది.