ఫ్లాట్‌ ఓపెనింగ్‌ నేడు?!

ఫ్లాట్‌ ఓపెనింగ్‌ నేడు?!

దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు అక్కడక్కడే అన్నట్లుగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ప్రస్తుతం సింగపూర్(ఎస్‌జీఎక్స్) నిఫ్టీ 7 పాయింట్ల స్వల్ప లాభంతో 12,015 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్ల ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. వరుసగా రెండో రోజు బుధవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు అక్కడక్కడే అన్నట్లుగా ముగిశాయి. అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాద పరిష్కార ఒప్పందం డిసెంబర్‌ వరకూ కుదిరే అవకాశంలేదన్న అంచనాలు తాజాగా ఇన్వెస్టర్లలో కొంతమేర ఆందోళనలకు కారణమైనట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దేశీయంగా 7 రోజుల ర్యాలీకి సోమవారం బ్రేక్‌ పడినప్పటికీ తిరిగి రెండు రోజులుగా జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో నేడు మార్కెట్లు కన్సాలిడేషన్‌ బాటలో సాగవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

సరికొత్త గరిష్టం
మిశ్రమ ప్రపంచ సంకేతాల నడుమ బుధవారం నీరసంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు తదుపరి టర్న్‌అరౌండ్‌ అయ్యాయి. మిడ్‌సెషన్‌ నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో లాభాల బాట పట్టాయి. మంగళవారం ఏడు రోజుల ర్యాలీకి బ్రేక్‌ పడగా.. బుధవారం తిరిగి జోరందుకున్నాయి. సెన్సెక్స్‌ 222 పాయింట్లు ఎగసి 40,470 వద్ద నిలవగా.. నిఫ్టీ 49 పాయింట్లు బలపడి 11,966 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ లాభాల ట్రిపుల్‌ సెంచరీ సాధించింది. 40,607 వద్ద సరికొత్త గరిష్టాన్ని తాకింది. ఈ బాటలో నిఫ్టీ 12,000 పాయింట్ల మార్క్‌ను అధిగమించింది. 

ఎఫ్‌పీఐల అండ
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1011 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 1117 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించాయి. కాగా.. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 473 కోట్లను ఇన్వెస్ట్ చేయగా..  డీఐఐలు దాదాపు రూ. 1594 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. ఇక సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 139 కోట్లు, డీఐఐలు రూ. 500 కోట్లు చొప్పున విలువైన స్టాక్స్‌ విక్రయించిన సంగతి తెలిసిందే.