మళ్లీ మార్కెట్ల దూకుడు

మళ్లీ మార్కెట్ల దూకుడు

మిశ్రమ ప్రపంచ సంకేతాల నడుమ నీరసంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు తదుపరి టర్న్‌అరౌండ్‌ అయ్యాయి. మిడ్‌సెషన్‌ నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో లాభాల బాట పట్టాయి. మంగళవారం ఏడు రోజుల ర్యాలీకి బ్రేక్‌ పడగా.. నేటి ట్రేడింగ్‌లో తిరిగి జోరందుకున్నాయి. కాగా.. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ లాభాల ట్రిపుల్‌ సెంచరీ సాధించింది. వెరసి 40,607 వద్ద సరికొత్త గరిష్టాన్ని తాకింది. చివరికి 222 పాయింట్లు ఎగసి 40,470 వద్ద నిలవగా.. నిఫ్టీ 49 పాయింట్లు బలపడి 11,966 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 12,000 పాయింట్ల మార్క్‌ను అధిగమించింది. కాగా.. వాణిజ్య వివాద పరిష్కార అంచనాలతో రెండు రోజులపాటు దూకుడు చూపిన అమెరికా స్టాక్‌ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. 

బ్యాంక్స్‌, రియల్టీ జోరు
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా రియల్టీ 2.3 శాతం, ప్రయివేట్‌ బ్యాంక్స్‌ 1.5 శాతం చొప్పున ఎగశాయి. అయితే పీఎస్‌యూ బ్యాంక్స్‌ 1 శాతం, మీడియా 0.6 శాతం చొప్పున బలహీనపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో సిప్లా, ఐసీఐసీఐ, ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్‌ఇండ్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, హిందాల్కో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బీపీసీఎల్‌, టాటా మోటార్స్‌ 3-1.3 శాతం మధ్య లాభపడ్డాయి. ఇతర బ్లూచిప్స్‌లో టైటన్‌ 10 శాతం పతనంకాగా, ఎయిర్‌టెల్‌, ఓఎన్‌జీసీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, మారుతీ, ఆర్‌ఐఎల్‌, ఐవోసీ, ఇబజాజ్‌ ఫైనాన్స్‌, గెయిల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ 3.4-1 శాతం మధ్య డీలాపడ్డాయి. 

జీఎంఆర్‌ జంప్‌
డెరివేటివ్‌ కౌంటర్లలో జీఎంఆర్ 7.3 శాతం జంప్‌చేయగా.. టొరంట్‌ పవర్‌, ఎస్‌ఆర్‌ఎఫ్‌, మదర్‌సన్‌, అదానీ ఎంటర్‌, యూబీఎల్, ఎన్‌బీసీసీ, గోద్రెజ్‌ సీపీ 4-3 శాతం మధ్య ఎగశాయి. అయితే ఐడియా, అపోలో టైర్‌, గ్లెన్‌మార్క్‌, అరబిందో, చోళమండలం, ఎన్‌సీసీ, బాష్‌, ఐబీ హౌసింగ్‌ 8.5-3.5 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. రియల్టీ కౌంటర్లలో ఇండియాబుల్స్‌, శోభా, డీఎల్‌ఎఫ్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, ప్రెస్టేజ్‌, ఒబెరాయ్‌ 5-1.2 శాతం మధ్య జంప్‌చేశాయి.

చిన్న షేర్లు వీక్‌ 
నష్టాల నుంచి బయటపడిన మార్కెట్లు చివరికి పటిష్ట లాభాలతో నిలవగా.. చిన్నతరహా కౌంటర్లకు ఒత్తిడి ఎదురైంది. బీఎస్‌ఈలో మిడ్‌ క్యాప్‌ 0.15 శాతం పుంజుకోగా.. స్మాల్‌ క్యాప్‌ 0.35 శాతం నీరసించింది. ట్రేడైన షేర్లలో 1222 లాభపడగా.. 1281 నష్టాలతో ముగిశాయి. 

ఎఫ్‌పీఐల అండ
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 473 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) దాదాపు రూ. 1594 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 139 కోట్లు, డీఐఐలు రూ. 500 కోట్లు చొప్పున విలువైన స్టాక్స్‌ విక్రయించిన సంగతి తెలిసిందే.