బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌-రాడికో Q2 షాక్‌

బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌-రాడికో Q2 షాక్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) రెండో త్రైమాసికంలో రివర్స్‌ టర్న్‌అరౌండ్‌ ఫలితాలు సాధించడంతో ఎలక్ట్రికల్ అప్లయెన్సెస్‌, లైటింగ్‌, విద్యుత్‌ ప్రసారం, పంపిణీ బిజినెస్‌ల కంపెనీ బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ కౌంటర్‌లో అమ్మకాలు ఊపందుకున్నాయి. కాగా.. మరోపక్క ఈ ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో సాధించిన ఫలితాలు అంచనాలను చేరకపోవడంతో లిక్కర్‌ తయారీ కంపెనీ రాడికో ఖైతాన్‌ లిమిటెడ్‌ కౌంటర్‌లో సైతం అమ్మకాలు తలెత్తాయి. వెరసి ఈ రెండు కౌంటర్లూ నష్టాలతో కళతప్పాయి. వివరాలు చూద్దాం..

బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌
ఈ ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ రూ. 32.5 కోట్ల నష్టం ప్రకటించింది. గతేడాది(2018-19) క్యూ2లో రూ. 30 కోట్ల నికర లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 32 శాతం క్షీణించి రూ. 1096 కోట్లను తాకింది. నిర్వహణ లాభం 70 శాతం పడిపోయి రూ. 24 కోట్లకు పరిమితమైంది. ఇబిటా మార్జిన్లు 4.9 శాతం నుంచి 2.2 శాతానికి పతనమయ్యాయి. ఈ కాలంలో పన్ను వ్యయాలు రూ. 21 కోట్ల నుంచి రూ. 3.7 కోట్లకు తగ్గాయి. ఇతర ఆదాయం రూ. 6 కోట్ల నుంచి రూ. 11 కోట్లకు ఎగసింది. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌ షేరు 6.3 శాతం పతనమైంది. రూ. 358 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 353 వరకూ జారింది. 

Image result for radico khaitan ltd

రాడికో ఖైతాన్‌ లిమిటెడ్‌
ఈ ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో రాడికో ఖైతాన్‌ లిమిటెడ్‌ నికర లాభం 57 శాతం జంప్‌చేసి రూ. 80 కోట్లను తాకింది. నికర అమ్మకాలు 10 శాతం పెరిగి రూ. 570 కోట్లకు చేరాయి. నిర్వహణ లాభం మాత్రం 5 శాతం క్షీణించి రూ. 87 కోట్లకు పరిమితమయ్యాయి. ఇబిటా మార్జిన్లు 17.7 శాతం నుంచి 15.2 శాతానికి బలహీనపడ్డాయి. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో రాడికో ఖైతాన్‌ షేరు 3 శాతం నీరసించి రూ. 319 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 308 వరకూ నష్టపోయింది.