పడిపోయిన స్టాక్స్‌ను కొంటున్నారా..? చేతులు కాలొచ్చు జాగ్రత్త!

పడిపోయిన స్టాక్స్‌ను కొంటున్నారా..? చేతులు కాలొచ్చు జాగ్రత్త!

"కింద పడిన ప్రతి షేరు తిరిగి పైకి దూసుకెళ్ళొచ్చు"... దలాల్ స్ట్రీట్‌లో ఆశావహులైన ట్రేడర్లు మాట్లాడుకునే మాట ఇది. కానీ అన్ని వేళలా ఇది పని చేయదనే చరిత్ర చెబుతోంది. దేశీయ స్టాక్ మార్కెట్‌లో పడిపోయన స్టాక్స్ చాలా వరకూ తిరిగి పైకి లేవనే లేదన్నది నిష్టూర సత్యం.  మార్కెట్లో ప్రముఖ మాజీ ట్రేడర్లు, బ్రోకర్లు చెప్పే కఠోర సత్యమిదే. సెన్సెక్స్ పోయిన వారం రికార్డు స్థాయిలో 40,300 పాయింట్లకు చేరడంతో మార్కెట్ సెంటిమెంట్ బలపడింది. ఇదే సమయంలో చాలా మంది ఇన్వెస్టర్లు బీటెన్ డౌన్ స్టాక్స్ ను కొనడానికి ఆసక్తి చూపారు. కానీ ఆయా స్టాక్స్ తిరిగి పుంజుకున్న దాఖలాలు చాలా తక్కువ అనే చెప్పాలి. గతంలో స్టాక్ మార్కెట్లలో కింద పడిన స్టాక్స్ చరిత్రేంటో ఓ సారి పరిశీలిద్దాం.
DHFL, యెస్ బ్యాంక్, PC జ్యూయల్లర్స్ వంటి స్టాక్స్ పూర్తిగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఇవి తిరిగి పుంజుకునే అవకాశాలు చాలా తక్కువే అని ఎనలిస్టులు పేర్కొంటున్నారు. ICICI సెక్యూరిటీస్ జరిపిన ఓ అధ్యయనం ప్రకారం 2010 ఆర్ధిక సంవత్సరం నుండి  దాదాపు 250 పడిపోయిన స్టాక్స్ లో 75శాతం వరకూ స్టాక్స్ తిరిగి పుంజుకోలేక పోయాయని వెల్లడైంది. వీటిలో కేవలం 14 స్టాక్స్ మాత్రమే తిరిగి వాటి గరిష్టానికి చేరుకున్నాయి. వీటిలో దాదాపు 71 స్టాక్స్ మదుపర్ల సంపదను పూర్తిగా ఆవిరి చేశాయి. 
JK లక్ష్మీ సిమెంట్, హెడిల్ బర్గ్ సిమెంట్, శ్రీచక్ర సిమెంట్ , హిందుస్థాన్ ఇంజనీరింగ్ అండ్ ఇండస్ట్రీస్, ఉత్తమ్‌ వాల్యూ స్టీల్ వంటి స్టాక్స్ ఇప్పటికీ 99 శాతం పడిపోయే ట్రేడ్ అవుతున్నాయి. బలహీనమైన ఆపరేటింగ్ వాతావరణం, స్టాక్స్ పట్ల పెట్టుబడిదారుల నమ్మకం సడలడం, కార్పోరేట్ పాలనపై ప్రశ్నలు , డిఫాల్ట్ ప్రమాదం వంటి కారణాలు తోడైతే.. ఆ స్టాక్‌ ఇంకా ఎంత కిందకు పడుతుందో అంచనా వేయలేమని ఎనలిస్టులు అంటున్నారు. ఇలాంటి స్టాక్స్ కు దూరంగా ఉండటమే మేలని వారు సూచిస్తున్నారు. 2010లో 77 స్క్రిప్పుల్లో కేవలం 9 మాత్రమే తిరిగి పుంజుకోగలిగాయి. 2011,2012 ఆర్ధిక సంవత్సరాల్లో 2,3 స్టాక్స్‌ మాత్రమే తిరగి వాటి గరిష్టానికి చేరుకున్నాయి. 2010లో ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ కంపెనీ స్టాక్ రూ. 37 నుండి రూ. 6 కు పడిపోయింది. దాదాపు 84శాతం వాల్యూని నష్టపోయింది. కానీ తిరిగి పుంజుకుని జూన్ 2014 నాటికి బలపడి 2018 నవంబర్ నాటికి రూ. 63.60 వద్దకు చేరుకుంది. ఇలా అన్ని స్టాక్స్ లో జరగాలని లేదు. బలరామ్ పూర్ చిన్ని మిల్స్,  ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజెస్ , NCC, బ్రిగేడ్ ఎంటర్‌ప్రైజెస్, ప్రకాష్ ఇండస్ట్రీస్, స్టెరిలైట్ టెక్నాలజీస్ , స్పైస్ జెట్ వంటివి మదుపర్ల సంపదను 75-85శాతం ఆవిరి చేసినా.. తిరిగి వాటి గరిష్ట లెవల్స్‌కు చేరుకున్నాయి. అలాగే కిరీ ఇండస్ట్రీస్‌ను చూస్తే..2011 సంవత్సరంలో  రూ.502 వద్ద ఉన్న స్టాక్ ఒక్కసారిగా రూ. 13 వద్దకు పడిపోయింది. దాదాపు 98శాతం నష్టపోయిన ఈ స్టాక్ జనవని 2010లో రూ. 793 వద్ద ట్రేడ్ అయింది. మళ్లీ మెల్ల మెల్లగా పుంజుకుని 2017లో గరిష్ట స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం రూ. 395 వద్ద ట్రేడ్‌ అవుతోంది ఈ స్టాక్.  
2011లో అహ్లువాలియా కాంట్రాక్ట్స్ , భారత్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ వంటి స్టాక్స్ దాదాపు 80శాతం నష్టపోయినా.. తిరిగి 2012లో పూర్తిగా కోలుకున్నాయి. కంపెనీ నిర్వాహణ, బ్యాలెన్స్ షీట్, బుక్ వాల్యూమ్స్ వంటివి పటిష్ట పరుచుకోడంతో ఈ స్టాక్స్ నిలదొక్కుకోగలిగాయి. 
ప్రస్తుతం సెన్సెక్స్ 40,000 దాటడం, నిఫ్టీ 12,000పాయింట్లకు చేరువలోకి రావడంతో చాలా మంది ఇన్వెస్టర్లు బీటెన్ డౌన్ స్టాక్స్ మీద పెట్టుబడి పెట్టాలని చూస్తారు. కానీ ఇలాంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టే ముందు కంపెనీ వార్షిక నివేదికలు, క్వార్టర్ ఫలితాలు, రుణాలు ఎంత ఉన్నాయి, మూల ధన నిల్వలు, నిర్వాహణ , మేనేజ్‌మెంట్ పనితీరు వంటివి పరిశీలించి మరీ తీసుకోవాల్సిందిగా మార్కెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు.