వారెవ్వా వరుణ్‌- గోద్రెజ్‌ కన్జూమర్

వారెవ్వా వరుణ్‌- గోద్రెజ్‌ కన్జూమర్

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) రెండో త్రైమాసికంలో సాధించిన ఫలితాలు అంచాలను చేరడంతో ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం గోద్రెజ్‌ కన్జూమర్ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. కాగా.. మరోపక్క ఈ ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్‌) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో పెప్సీకో ఫ్రాంచైజీ కంపెనీ వరుణ్‌ బెవరేజెస్‌ లిమిటెడ్‌ కౌంటర్‌కు డిమాండ్‌ కొనసాగుతోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం..

వరుణ్‌ బెవరేజెస్‌ లిమిటెడ్‌
ఈ ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్‌) ఫలితాల నేపథ్యంలో విదేశీ రీసెర్చ్‌ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ బయ్‌ రేటింగ్‌ను ప్రకటించడంతో వరుణ్‌ బెవరేజెస్‌ లిమిటెడ్‌ కౌంటర్‌ మరోసారి జోరందుకుంది. సమీప భవిష్యత్‌లో కంపెనీ మరింత మెరుగైన పనితీరును చూపనుందన్న అంచనాలతో వరుణ్‌ బెవరేజెస్‌ షేరుకి సీఎల్‌ఎస్‌ఏ రూ. 860 టార్గెట్‌ ధరను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 9 శాతం జంప్‌చేసి రూ. 764 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 784 వద్ద సరికొత్త గరిష్టాన్ని తాకింది. మంగళవారం సైతం ఈ షేరు 10 శాతం దూసుకెళ్లి రూ. 702 వద్ద ముగిసిన విషయం విదితమే. కాగా.. క్యూ2లో వరుణ్‌ బెవరేజెస్‌ నికర లాభం 84 శాతం జంప్‌చేసి రూ. 81 కోట్లను అధిగమించింది. మొత్తం ఆదాయం సైతం 49 శాతం ఎగసి రూ. 1740 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం 54 శాతం పురోగమించి రూ. 326 కోట్లను తాకింది. ఇబిటా మార్జిన్లు 8.9 శాతం నుంచి 6.5 శాతానికి బలహీనపడ్డాయి.

గోద్రెజ్‌ కన్జూమర్ ప్రొడక్ట్స్‌
ఈ ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో గోద్రెజ్‌ కన్జూమర్ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌ నికర లాభం 28 శాతం క్షీణించి రూ. 414 కోట్లను తాకింది.  గతేడాది(2018-19) క్యూ2లో రూ. 259 కోట్ల అనూహ్య ఆర్జన కారణంగా నికర లాభాలు అధికంగా నమోదైన విషయాన్ని ఈ సందర్భంగా కంపెనీ ప్రస్తావించింది. కాగా.. మొత్తం ఆదాయం స్వల్పంగా తగ్గి రూ. 2630 కోట్లకు పరిమితమైంది. నిర్వహణ లాభం మాత్రం 18 శాతం పుంజుకుని రూ. 571 కోట్లకు చేరింది. ఇబిటా మార్జిన్లు 18.2 శాతం నుంచి 21.2 శాతానికి బలపడ్డాయి. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో గోద్రెజ్‌ కన్జూమర్ ప్రొడక్ట్స్‌ షేరు 2.4 శాతం పుంజుకుని రూ. 739 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 5 శాతం జంప్‌చేసి రూ. 758 వరకూ ఎగసింది.