డాలర్ డ్రీమ్స్‌కు బ్రేకులే బ్రేకులు..! #NO VISAS

డాలర్ డ్రీమ్స్‌కు బ్రేకులే బ్రేకులు..! #NO VISAS

ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ విధానాల ఫలితంగా అమెరికా వెళ్లాలనుకునే వారి కలలు కల్లలుగా మిగిలిపోనున్నాయా.? అవుననే అంటుంది అమెరికాకు చెందిన ఓ సర్వే సంస్థ. తాజాగా ఈ అమెరికన్ సంస్థ చేపట్టిన ఓ సర్వేలో H-1 B విసాల తిరస్కరణ రేటు 2015లో 6 శాతం ఉండగా, ఈ ఆర్ధిక సంవత్సరం మూడో త్రైమాసికంలో అది గణనీయంగా 24శాతానికి పెరిగింది.
యుఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్  (USCIS) నుండి వచ్చిన డేటా ఆధారంగా నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ చేసిన అధ్యయనం ప్రకారం ప్రధాన భారతీయ ఐటి కంపెనీలలో హెచ్ -1 బి వీసాలకు తిరస్కరణ రేటు అత్యధికంగా ఉన్నాయని వెల్లడైంది. ఇదే విషయాన్ని పలు భారతీయ కంపెనీలు గగ్గోలు పెడుతున్నా.. అమెరికన్ ట్రంప్ ప్రభుత్వం మాత్రం మితిమీరిన జాతీయవాదాన్ని చూపిస్తుందని పలు ఐటీ సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఉదాహరణకు, అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్ మరియు గూగుల్ కోసం 2015 లో ప్రారంభ ఉపాధి కోసం హెచ్ -1 బి పిటిషన్ల తిరస్కరణ రేటు కేవలం ఒక శాతం మాత్రమే ఉండేది. కానీ 2019 లో ఇది వరుసగా 6, 7, 8  శాతానికి పెరిగింది. ఆపిల్ కోసం భారతీయ ఉద్యోగార్ధులు పెట్టుకున్న వీసాల అభ్యర్ధనల తిరస్కరణ రేటు 2 శాతంగా ఉంది. ఇదే సమయంలో వీసాల తిరస్కరణ రేటు టెక్ మహీంద్రాకు 4శాతం నుండి 41శాతానికి, టాటా కన్సెల్టెన్సీ సర్వీస్‌కు 6శాతం నుండి 34శాతానికి , విప్రోకు 7శాతం నుండి 53 శాతానికి పెరిగిందని ఆ సర్వేలో వెల్లడైంది.
పలు అమెరికన్ కంపెనీలకు IT సేవలు అందించే భారత దేశానికి చెందిన 12 కంపెనీలు 2019 ఆర్ధిక సంవత్సరం మొదటి మూడు క్వార్టర్లలో దాదాపు 30శాతానికి పైగా తిరస్కరణ రేట్లను కలిగి ఉండటం విశేషం. ఇది 2015లో 7శాతంగా ఉండేది. నిరంతర ఉపాధి కోసం హెచ్ -1 బి పిటిషన్ల తిరస్కరణ రేటు భారతీయ ఐటి కంపెనీలకు కూడా ఎక్కువగా ఉంది. టెక్ మహీంద్రాకు ఇదే కాలంలో రెండు శాతం నుంచి 16 శాతానికి పెరిగింది, విప్రో నాలుగు శాతం నుంచి 19 శాతానికి, ఇన్ఫోసిస్ ఒక శాతం నుంచి 29 శాతానికి పెరిగిందని అమెరికన్ కంపెనీ చేపట్టిన అధ్యయనంలో తేలింది. కాగా ప్రధాన అమెరికన్ కంపెనీలైన అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్ కంపెనీల్లో మాత్రం ఈ విసా తిరస్కరణ శాతం చాలా తక్కువగా ఉండటం గమనార్హం. 
బాగా చదువుకున్న విదేశీ పౌరులకు సైన్స్ మరియు ఇంజనీరింగ్ రంగాల్లో అమెరికాలో పనిచేయడం కష్టతరంగా మారాలన్నదే ట్రంప్ పాలనా లక్ష్యంగా ఉన్నట్టు తెలుస్తుందని ఈ సర్వే పేర్కొంది. 2019 ఆర్థిక సంవత్సరం మొదటి మూడు త్రైమాసికాలలో, యుఎస్ పౌరసత్వం మరియు ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ న్యాయాధికారులు ప్రారంభ ఉపాధి కోసం హెచ్ -1 బి పిటిషన్లలో 24 శాతం, నిరంతర ఉపాధి కోసం 12 శాతం హెచ్ -1 బి పిటిషన్లను తిరస్కరించారు. నిరంతర ఉపాధి కోసం 12 శాతం తిరస్కరణ రేటు కూడా చారిత్రాత్మకంగా ఎక్కువని థింక్ ట్యాంక్ సర్వే సంస్థ పేర్కొంది. 
ఇలా నైపుణ్యం ఉన్న మానవ వనరులను అమెరికాలోకి అనుమతించక పోవడం వల్ల సరికొత్త ఆవిష్కరణలకు వీలు కాని పరిస్థితులు ఏర్పడతాయని, ఇదే సమయంలో ఇతర దేశాలకు స్కిల్డ్ లేబర్ తరలిపోయి అక్కడ నూతన ఆవిష్కరణలు , ఆర్ధికాభివృద్ధికి దోహదపడొచ్చని అమెరికన్ సంస్థ థింక్‌ట్యాంక్ తెలిపింది. అమెరికాలో కొత్త ఇన్వెన్షన్స్ కొరవడటం మూలంగా ఆ దేశం తీవ్రంగా నష్టపోనుందని , ఇది ట్రంప్ పాలనా వైఫల్యంగా మిగిలిపోనుందని అమెరికన్ సంస్థ వాఖ్యానించింది. ప్రస్తుతం భారతీయ నైపుణ్య ఉద్యోగులు, స్కిల్ట్ లేబర్ కెనడా, ఆస్ట్రేలియాల వైపు చూస్తుండటంతో ఆ దేశాలు వారి కోసం గేట్లను తెరిచే ఉంచాయి. అమెరికా కలలను భారతీయులు కెనడా, ఆస్ట్రేలియా వంటి ఇతర దేశాల వైపు మళ్ళిస్తున్నారు.