రియల్టీకి ప్రభుత్వ బూస్ట్‌?

రియల్టీకి ప్రభుత్వ బూస్ట్‌?

పెద్ద నోట్ల రద్దు.. వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ), లిక్విడిటీ కొరత వంటి సమస్యలతో గత మూడేళ్లుగా మందగమన ప్రభావాన్ని చవిచూస్తున్న రియల్‌ ఎస్టేట్‌ రంగంపై ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం దృష్టిపెట్టనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రియల్టీ రంగానికి బూస్ట్‌నిచ్చే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలియజేశారు. ఇందుకు వీలుగా రిజర్వ్‌ బ్యాంక్‌తో కలసి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తాజాగా తెలియజేశారు. రియల్టీ రంగాన్ని పరుగు తీయించేందుకు సమస్యాత్మకంగా ఉన్న ప్రస్తుత చట్టాలను సైతం సవరించనున్నట్లు పేర్కొన్నారు. రియల్టీ రంగానికి సంబంధించి ప్రత్యామ్నాయ పెట్టుబడి సంస్థలు సైతం తమను సంప్రదిస్తున్నట్లు వివరించారు. ఇంతవరకూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పలు సంస్కరణల్లో రియల్టీ రంగానికి ప్రాతినిధ్యం లభించలేదని.. ఇకపై అటు రిజర్వ్‌ బ్యాంక్‌, ఇటు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. దీంతో రియల్టీ రంగంలోని లిస్టెడ్‌ కంపెనీల షేర్లకు ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగింది. వివరాలు చూద్దాం..

లాభాల బాట..
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటనల నేపథ్యంలో రియల్టీ రంగ కౌంటర్లు జోరందుకున్నాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో రియల్టీ ఇండెక్స్‌ 2.5 శాతం ఎగసింది. రియల్టీ షేర్లలో శోభా 5 శాతం జంప్‌చేసి రూ. 435ను తాకగా.. ఇండియాబుల్స్‌ 5 శాతం పెరిగి రూ. 67కు చేరింది. ఈ బాటలో డీఎల్‌ఎఫ్‌ 3.7 శాతం ఎగసి రూ. 191 వద్ద, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ 3.4 శాతం పుంజుకుని రూ. 987 వద్ద, ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్‌ 2.8 శాతం పురోగమించి రూ. 308 వద్ద ట్రేడవుతున్నాయి. ఇతర కౌంటర్లలో సన్‌టెక్‌ 2.2 శాతం లాభంతో రూ. 446కు చేరగా.. ఒబెరాయ్‌ 1.3 శాతం బలపడి రూ. 506 వద్ద ట్రేడవుతోంది. బ్రిగేడ్‌ సైతం 0.5 శాతం లాభంతొ రూ. 207 వద్ద కదులుతోంది. అయితే ఇటీవల ర్యాలీ చేసిన మహీంద్రా లైఫ్‌ 1.35 శాతం క్షీణించి రూ. 397 వద్ద ట్రేడవుతోంది.