ఇన్ఫోసిస్‌ను కావాలనే టార్గెట్ చేశారా ? ఇది బయటి వ్యక్తుల పనేనా ?

ఇన్ఫోసిస్‌ను కావాలనే టార్గెట్ చేశారా ? ఇది బయటి వ్యక్తుల పనేనా ?

ఇన్ఫోసిస్‌లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు చేసిన 'ఎథికల్ ఎంప్లాయిస్' గా చెప్పుకుంటున్న విజిల్ బ్లోయర్స్ వివాదం సంచలనాన్ని రేకెత్తించింది. ఇన్ఫోసిస్‌ మీద సెబీకి ఆరోపణలు చేసి, తగిన ఆధారాలు వాయిస్ రికార్డులు మా వద్ద ఉన్నాయంటూ విజిల్ బ్లోయర్స్ చేసిన ఆరోపణల మీద ఇన్ఫోసిస్ అంతర్గత విచారణ కమిటిచే దర్యాప్తు కూడా చేయించింది. ఎలాంటి అక్రమాలు జరగలేదని ఆ కమిటీ తేల్చి చెప్పడంతో అసలు ఇన్ఫోసిస్‌లో ఎం జరుగుతోందన్న దానిపై ఇన్వెస్టర్లు, మార్కెట్ ట్రేడర్లు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. 

Image result for infosys whistleblower
ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సలీల్ పరేఖ్ కార్పోరేట్ పాలనలో పలు అవకతవకలకు పాల్పడ్డారని విజిల్ బ్లోయర్స్ ఆరోపించారు. కానీ దీని వెనుక సంస్థ యొక్క కో ఫౌండర్, మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ కుట్ర పన్ని ఉంటారని ఇన్ఫోసిస్ బోర్డు పెద్దలు భావిస్తున్నారు. 
కాగా ఈ విజిల్ బ్లోయర్స్ ఇన్ఫోసిస్ సీఈఓ పరేఖ్ , చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నీలాంజన్ రాయ్‌ మీదే ప్రధానంగా గురి పెట్టారు. వారిపై ఆరోపణలకు సంబంధించి ఆధారాలంటూ అమెరికా స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌కు , సెక్యూరిటీ కమీషన్‌కు పలు రికార్డింగ్స్ , ఈమెయిల్స్ ను పంపారు. ఈ ఆరోపణల ఉదంతంతో అక్టోబర్ 22 నాటికి ఇన్ఫోసిస్ షేర్లు 16శాతం పడిపోవడమే కాకుండా  రూ. 53,000 కోట్ల మదుపర్ల పెట్టుబడి ఆవిరైపోయింది. వీసా ఖర్చులు లెక్కల్లో చూపించొద్దని, మరియు కీలక సమాచారాన్ని బోర్డు, ఆడిటర్ల నుండి దాచాలని పరేఖ్ , రాయ్‌లు పట్టుబట్టారని విజిల్ బ్లోయర్స్ ఆరోపించారు. ఇవే కాకుండా బిలియన్ డాలర్ల ఒప్పందాలను జీరో మార్జిన్ల కింద చూపించారని, పరేఖ్‌ ఇద్దరు స్వతంత్ర డైరెక్టర్లను సైతం నిబంధనలకు విరుద్ధంగా నియమించారని విజిల్ బ్లోయర్స్ ఆరోపించారు.

Image result for infosys whistleblower

కాగా ఈ ఆరోపణల మీద ఇన్ఫోసిస్ శార్దూల్ అమర్ చంద్ మంగళదాస్‌ను విచారణాధికారిగా నియమించింది. తగిన సాక్ష్యాలు లేకుండా ఈ ఆరోపణల విశ్వసనీయతను నిర్ణయించలేమని ఇన్ఫోసిస్ సోమవారం నాడు విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ బుధవారం నాడు గతంలో షెడ్యూల్ చేసిన పెట్టుబడిదారులు, విశ్లేషకుల సమావేశాన్ని యథావిధిగా నిర్వహించనుంది. 
విజిల్ బ్లోయర్స్ పేర్కొన్న ఆరోపణల్లో నిజం ఉంటే అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని, ఎవరు దోషిగా తేలినా చర్య ఖచ్చితంగా ఉంటుందని ఇన్ఫోసిస్ పేర్కొంది. దేశంలోనే ప్రముఖ IT దిగ్గజమైన ఇన్ఫోసిస్‌ను కావాలనే అప్రతిష్ట పాలు చేస్తున్నారని, మదుపర్లు విశ్వాసం కోల్పోవద్దని ఇన్ఫోసిస్ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా ఈ ఆరోపణల వెనుక ప్రధానంగా కంపెనీ కో ఫౌండర్, మాజీ సీనియర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ హస్తం ఉండి ఉంటుందని బోర్డు విశ్వసించడం ఇక్కడ కొసమెరుపు.