ఈ సారి తీసుకునే నిర్ణయాలు మామూలుగా ఉండవు..!

ఈ సారి తీసుకునే నిర్ణయాలు మామూలుగా ఉండవు..!

 కేంద్రంలో రెండోసారి అధికారం చేపట్టిన బీజేపీ ప్రభుత్వం సంస్కరణలకే పెద్ద పీఠ వేయనుందని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అంటున్నారు. తొలి సారి అధికారం చేపట్టిన మోదీ ప్రభుత్వం రాజ్యసభలో తగినంత బలం లేక పోవడంతో సంస్కరణలను ముందుకు తీసుకుపోలేక పోయిందని, ఈ సారి బస్సును మిస్‌ కాబోమని ఆమె పేర్కొన్నారు. మార్కెట్ల బలోపేతానికి, ఆర్ధిక సంస్కరణలకు ఊతమిచ్చేలా పలు ప్రణాళికలను రచించనున్నట్టు నిర్మలా సీతారామన్ వాఖ్యానించారు. సంస్కరణల రూపకల్పన, అమలు విషయంలో పూర్తి నిబద్ధతను చూపించబోతున్నామని , మోడీ 2.O పాలన మరింత వేగంగా ఉండబోతుందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వూలో ఆర్ధిక మంత్రి పేర్కొన్నారు. 
కాగా పూర్తి స్థాయి జాతీయ వాదం పెరిగిపోవడంతోనే మహరాష్ట్రా, హర్యానా ఎన్నికల్లో బీజేపీకి తక్కువ సీట్లు వచ్చాయన్న వాదనను ఆమె కొట్టిపారేశారు. వ్యవసాయ రంగంతో తీవ్ర సంక్షోభం, పెరుగుతున్న నిరుద్యోగం వంటి కఠినమైన ఆర్ధిక వాస్తవాలను తోసిపుచ్చలేమని, వీటికి పూర్తి పరిష్కార మార్గాలు వెతుకుతున్నామని ఆమె అన్నారు. మోదీ ప్రభుత్వ తొలినాళ్లలో రాజ్యసభలో  విపక్షాలు ఆర్ధిక సంస్కరణలకు మోకాలొడ్డాయనీ, దీనికి దేశం మూల్యం చెల్లించాల్సి వచ్చిందని, ఈ సారి అలా జరగకుండా చూస్తామని నిర్మలా అంటున్నారు. ఏ ఏ రంగాల్లో సంస్కరణలు ఉండబోతున్నాయన్నదానిపై నిర్మలా సీతారామన్ స్పష్టత ఇవ్వనప్పటికీ.. దేశంలో పెట్టుబడుల వెల్లువను పెంచడానికి, వ్యవసాయం, విద్య, భూసేకరణ, ఈజ్ ఆఫ్‌ డూయింగ్ బిజినెస్  వంటి వాటిలో ఈ సంస్కరణలు ఉండబోతున్నాయని  మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. NBFCల లిక్విడిటీ కొరత, బ్యాంకింగ్ రంగాన్ని బలోపేతం చేయడం, నిరర్ధక ఆస్తులు, కార్పోరేట్ వ్యాపారాలు వంటి వాటిలో సంస్కరణలు , మార్పులు ఉండనున్నట్టు సమాచారం. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో కార్పోరేట్ ట్యాక్స్ కట్‌ కూడా సత్ఫలితాలను ఇస్తుందని, పలు బహుళ జాతి కంపెనీలు తాజాగా భారత దేశం వైపు చూస్తున్నాయని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.